ఆ మూడింటికి ఆధార్ అవసరం లేదు

First Published 12, Feb 2018, 1:08 PM IST
Highlights
  • ఆధార్ కార్డు తప్పనిసరిపై యూఐడీఏఐ తాజా ప్రకటన
  • కొన్ని సర్వీసులపై సడలింపు ప్రకటించిన యూఐడీఏఐ

కేంద్ర ప్రభుత్వం అందించే సేవలు, సంక్షేమ పథకాలు, ప్రయోజనాలు పొందాలంటే ఆధార్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఆధార్ పత్రాలుగాని, ఆధార్ నంబర్‌ను గాని సంబంధిత ఏజెన్సీలకు తప్పకుండా సమర్పించాల్సి ఉంటుంది. పలు చోట్ల ఆధార్ కార్డు లేకపోతే సాధారణ పౌరులు కొన్ని అత్యవసర సేవలు పొందలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో యూఐడీఏఐ(భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ) కొన్నింటికి మినహాయింపులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 


వైద్య సేవలు, పాఠశాలల్లో ప్రవేశాలకు, రేషన్ దుకాణాల్లో తక్కువ ధరకు సరకులు పొందడానికి.. ఆధార్ అవసరం లేదని ప్రకటించింది. ఈ మేరకు యూఐడీఏఐ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులకు లేఖ రాసింది.  ఆధార్ లేదనే కారణంతో గుర్గావ్‌లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో  నిండు గర్భిణిని చేర్చుకోకపోవడంతో ఆమె గేటు వద్దనే ప్రసవించిన సంగతి తెలిసిందే.  ఈ ఘటపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పలువురు సోషల్ మీడియా వేదిక ఆధార్ పై విమర్శలు చేశారు. దీంతో.. యూఐడీఏఐ పైవిధంగా ఆదేశాలు జారీ చేసింది.

Last Updated 25, Mar 2018, 11:40 PM IST