
సోషల్ మీడియా జోలికి పోవటమన్నది తేనెతుట్టెను కెలకటం లాంటిదే. సోషల్ మీడియాను నియంత్రించటమంటే సముద్రాన్ని దోసిలిలో పట్టుకోవాలని ప్రయత్నించటమే. సాధ్యా, సాధ్యాలగురించి ఆలోచించకుండా చంద్రబాబునాయుడు, లోకేష్ ఇపుడదే పనిచేస్తున్నారు. వ్యతిరేక కార్టూన్లు వస్తున్నాయంటూ సోషల్ మీడియాను నియంత్రించాలని, కార్టూన్లు వేసే వారిని అరెస్టు చేస్తామని ఇటీవలే లోకేష్ హెచ్చరించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇపుదుదాన్నే నిజం చేస్తు రవికిరణ్ అనే యువకుడిని అరెస్టు చేయించారు.
పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కార్టూన్లు వేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని, అరెస్టులు చేయిస్తామంటూ చెప్పిన లోకేష్ అన్నంత పనీ చేసారు. శంషాబాద్ కు చెందిన రవికిరణ్ అనే యువకుడిని తుళ్ళూరు పోలీసులు అరోస్టు చేసారు. ఈరోజు తెల్లవారుజామున తన ఇంట్లో రవి నిద్రిస్తుండగా పోలీసులు వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్ళిపోయారు. రవి భార్య సృజన మాట్లాడుతూ, తెల్లవారిజామున కొందరు వచ్చి తన భర్త రవికిరణ్ ను మాట్లాడాలి రమ్మంటూ చెప్పి కారులో కూర్చోబెట్టుకుని వెళ్ళిపోయారని ఫిర్యాదు చేసారు. ఆయన భార్య చెప్పిన ప్రకారం రవి వైసీపీ కార్యాలయంలో పనిచేస్తున్నారు.
శాసనసభ ఇన్ ఛార్జి కార్యదర్శి సత్యనారాయణ తుళ్లూరు పోలీసు స్టేషన్లో చేసిన ఫిర్యాదు మేరకు రవిని అరెస్టు చేసినట్లు సమాచారం. సభ్యుల మనోభావాలు దెబ్బతినేట్లుగా సోషల్ మీడియాలో కార్టూన్లు వేసినట్లు టిడిపి ఎంఎల్సీ టిడి జనార్ధన్ శాసనమండలి ఛైర్మన్ చక్రపాణికి ఫిర్యాదు చేసారట. ఆ ఫిర్యాదు మేరకే శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి ఆదేశాల ఇవ్వగా ఇన్ ఛార్జ్ కార్యదర్శి సత్యనారాయణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. సభ్యుల మనోభావాలు దెబ్బతినేలా కార్టూన్లు వేసినందుకు రవిపై ఫిర్యాదు చేసారని చెబుతున్నారు. సోషల్ మీడియాలో చంద్రబాబు, లోకేష్ పైన కార్టూన్లు వేసినందుకే రవిని అరెస్టు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
నిజంగానే సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా కార్టూన్లు వస్తున్నాయని అరెస్టులు చేస్తే మరి, వైసీపీ పైన, జగన్మోహన్ రెడ్డిపైన కార్టూన్లు వేసే వారిని ఏం చేయాలి. జగన్, వైసీపీ పైన అదే పనిగా టిడిపి కూడా ఎన్నో కార్టూన్లు వేయిస్తోంది. వ్యతిరేక కార్టూన్లు విసినందుకే రవికిరణ్ ను అరెస్టు చేస్తే టిడిపిలో పనిచేస్తున్న, టిడిపి గ్రూపులు నడుపుతున్న కొన్ని వందల మందిని పోలీసులు అరెస్టులు చేయాల్సివస్తుంది. మరి, ప్రభుత్వం ఆ పనిచేయగలదా? ఎంతమందిపైన కేసులు పెడుతుంది? ఎన్ని వేలమందిని అరెస్టులు చేయిస్తుంది? అధికారంలోకి వచ్చేందుకు ఇదే సోషల్ మీడియాను టిడిపి అడ్డంపెట్టుకోలేదా? తమలో తప్పులను సర్దబాటు చేసుకోకుండా సోషల్ మీడియాపై పడితే ఏం ఉపయోగం? మొత్తానికి లోకేష్, చంద్రబాబునాయుడులు తేనెతుట్టెను కెలుకుతున్నట్లే ఉన్నారు.