ఆ నగదు కష్టాలు మళ్లీ రానీయొద్దు ప్లీజ్

First Published Mar 10, 2017, 3:19 AM IST
Highlights

నగదు కష్టాలు మళ్లీ వస్తున్నట్లున్నాయి, ఇలా అయితే మరొక లేఖ రాస్తా : హెచ్చరించిన ముఖ్యమంత్రి

అయిదురాష్ట్రాలలో ఎన్నికలయిపోయాయో లేదో అపుడే నగదు కొరత మళ్లీ తలెత్తింది. ఈ వేడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కి కూడా  తగిలింది. అందుకే ఆయన గురువారం నాడు బ్యాంకర్ల తో సమావేశమయినపుడు ఈ విషయమే ప్రధానంగా చర్చకు వచ్చింది. డిమానెటైజేషన్ నాటి పరిస్థితి మళ్లీ తలెత్తుతుందేమోమననే ఆందోళన వ్యక్తం చేశారు.

 

బ్యాంకులు నగదు లావాదేవీలపై విధిస్తున్న అదనపు చార్జీలపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.నగదు ఉపసంహరణపై నియంత్రణ పెడితేనే బాగుంటుందన్న ఆలోచనే రాకూడదని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో మళ్లీ తలెత్తు తున్న నగదు కొరత గురించి తనఅమరావతి కార్యాలయంలో ముఖ్యమంత్రి గురువారం సమీక్ష చేశారు.

 

ఈ సందర్భంగా ఆయన ఒక విషయం బయటపెట్టారు. తన ఆధ్వర్యంలోనే  ఏర్పాటయిన డిమానెటైజేషన్  కమిటీ సమర్పించిన నివేదికలోని సిఫార్సులలో  ఎన్ని అమలు చేస్తున్నారో తనకు తెలియజేయాలని ఆయన కేంద్రానికి, బ్యాంకర్లను కోరారు. డీమోనిటైజేషన్ తర్వాత పరిస్థితి  పునరావృత్తం కానివ్వరాదని ఆయన అన్నారు.

 

రాష్ట్రంలో నగదు నిల్వలు, నగదు సరఫరా పెంచాలని గత వారం తాను రిజర్వుబ్యాంకుకు లేఖరాశానని, మళ్లీ రిజర్వు బ్యాంకు గవర్నర్ తో మాట్లాడతానని ముఖ్యమంత్రి చెప్పారు. డిజిటల్ లావాదేవీలను కూడా సమీక్షించాలని అన్నారు. బ్యాంకుల నుంచి డిజిటల్, నాన్ డిజిటల్ లావాదేవీలపై తనకు నివేదిక సమర్పించాలని చంద్రబాబు కోరారు.

 

పెట్రోల్ బంకులకు బ్యాంకులకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలను ఇవ్వటం లేదని యజమానులు ఫిర్యాదు చేస్తున్నారని, ఈ పరిస్థితిని చక్కదిద్దాలని కూడా ఆయన బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు.

 

ఇందువల్ల ప్రజలు నష్టపోతున్నారని అన్నారు. తిరిగి డీమోనిటైజేషన్ నాటి పరిస్థితి రానివ్వరాదన్నారు. నగదు కొరతపై రిజర్వు బ్యాంకు తక్షణం స్పందించాలని కోరారు. నియంత్రణ చర్యలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కోరారు.

 

శుక్ర, శనివారాల్లో మరోసారి సమావేశమవుదామని, ఈలోగా నివేదిక సిద్ధం చేయాలన్నారు.

click me!