
నంద్యాల, కాకినాడ దూకుడును తెలుగుదేశం పార్టీ మరింత ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నది. ముఖ్యంగా నంద్యాలలో టిడిపి గెలుపు గోసాయి చిట్కా తెలిసిపోయిందనే ధీమా తెలుగుదేశం నాయకత్వంలో పెల్లుబుకుతూ ఉంది. రాష్ట్రమంతా ఇంక నంద్యాల ప్రయోగమే నని పెద్దనాయుడు, చిన్నబాబు లతోపాటు మంత్రులు ఎమ్మెల్యేలు వూదరగొట్టేస్తున్నారు. నిన్నటికి నిన్న డోన్ నియోజకవర్గాన్నివైసిపి బుగ్గున నుంచి లాగేసుకుంటాం, అతగాడు ఇంకా మాజీ ఎమ్మెల్యే నేనని ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి కూడా ఉబ్బితబ్బిబ్బయి ప్రకటించాడు.
పార్టీ వర్గాల కథనం ప్రకారం, మెల్లిమెల్లిగా నంద్యాల ప్రయోగాన్ని మరికొన్నిచోట్లచేయాలని టిడిపి అధినేత భావిస్తున్నారు. దీనికోసం ఒకటి రాయలసీమలో ,మరొకటి ఉత్తరాంధ్రలో చేయాలని భావిస్తున్నారని టిడిపి నేత ఒకరు ‘ఏషియానెట్ ’ కు తెలిపారు. రాయలసీమ కు సంబంధించి కడప జిల్లాలోని రాజంపేట మునిసిపాలిటి, ఉత్తరాంధ్రకు సంబంధించి విశాఖ కార్పొరేషన్ ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందని తర్జన భర్జన పార్టీలో మొదలయిందని ఆయన చెప్పారు.
కడప జిల్లా రాజంపేటలో ఎన్నికలు జరిపితే, పక్కనే ఉన్న నంద్యాల ప్రభావం ఇపుడు బాగా పనిచేస్తుందని, గెలవడం చాలా సుళువువుతందని అంటూ, ఇది పులివెందుల జైత్రయాత్రకు ట్రంక్ రోడ్ వేసినట్లువుతందని పార్టీ అధినాయకుల్లో ధైర్యం ఉందని ఆయన చెప్పారు.
విశాఖ, తిరుపతి,ఒంగోలు, గుంటూరు, కర్నూలులో కార్పొరేషన్ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆచి తూచి వీటిని ఒక్కటొక్కటి గెల్చుకుంటుూ పోతూంటే, 2019 ఎన్నికల మీద ఈ గెలుపుల ప్రభావం ఉంటుందని టిడిపి భావిస్తున్నది.
రాజంపేట మీద కన్నేసేందుకు అక్కడి ఎమ్మెల్యే టిడిపి వాడు కావడమే కారణం. 2014 జిల్లాలో టిడిపి గెల్చుకున్నదిదొక్కకటే. ఇక విశాఖ కు సంబంధించి, ఎన్నిక వత్తిడి తీసుకువస్తున్నది హెచ్ ఆర్ డి మంత్రి గంట శ్రీనివాస రావు. ఆయన తన పలుకుబడి ఏమిటో నిరూపించి 2019 ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో తన హవా సాగించాలని చూస్తున్నారట.అందుకని విశాఖ కయ్యానికి కాలదువ్వుతున్నాడని తెలిసింది. మరి జగన్ వ్యూహమేమిటో... ఎందుకంటే, రాజంపేట ఎమ్మెల్యే తెలుగుదేశానికి చెందిన వాడయినా, రాజంపేట మునిసిపల్ ఎన్నికల గెలుపుని, జిల్లా మీద జగన్ పట్టు సడలుతూ ఉందని భాష్యం చెపుకునేందుకు తెలుగుదేశం బాగా వాడుకుంటుంది. దీనిని వైసిపి నేత ఎలా అడ్డుకుంటారో చూడాలి.