హైదరాబాద్ సక్సెస్ రహస్యం ఇదే

First Published Dec 5, 2017, 5:07 PM IST
Highlights

కొరియా ఇన్వెస్టర్లకు ఆంధ్రా తలుపులు అన్ని వేళలా తెరిచే ఉంటాయి. కావాలంటే కియా మోటార్స్ ను  అడిగి తెల్సుకోండి...

హైదరాబాద్ ను తాను ఎలా అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దక్షిణ కొరియా ఇన్వెస్టర్లకు ఈ రోజు వివరించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కొరియా పర్యటనలో ఉన్నారు. ఈ రోజు రెండో రోజు.  ఈ సందర్భంగా ఆయన  వారితో సంభాషించారు. హైదరాబాద్ గ్లోబల్ సిటి ఎలా అయిందో గుట్టు విప్పారు. దానికి కారణం సైబరాబాద్ ను తాను నిర్మించడమేనని ఆయన అసలు విషయం చెప్పారు.

 

‘ఇరవై ఏళ్ల క్రితం నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాను. జంట నగరాలకు ‘సైబరాబాద్’ అనే మరొక నగరాన్ని చేర్చాను. అదీ కథ. ఆ  ఫలాలను ఇప్పుడు హైదరాబాద్ అనుభవిస్తోంది. విభజన తరువాత మళ్లీ జీరో నుంచి నా పని మొదలైంది. ఒక సంక్షోభంలో మా ప్రయాణాన్ని ఆరంభించాం. ఐతే అదే సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుంటున్నాం,’ అని ముఖ్యమంత్రి అన్నారు.

 కొరియా కూడా ఇలాంటి కష్టాలను ఎదుర్కొన్న విషయం తనకు తెలుసని చెబుతూ అయినా సరే ఇక్కడ అభివృద్ధి అనూహ్యంగా జరిగిందని కొనియాడారు.

‘ శరవేగంగా దేశం అభివృద్ధి చెందింది. ఇది ఇక్కడి పాలకులు, అభివృద్ధిలో భాగస్వాములైన మీ అందరి వల్లనే సాధ్యమైంది. మేమిప్పుడు ఆ స్ఫూర్తిని తీసుకుని అభివృద్ధి బాటలో ఉన్నాం. కొత్త రాష్ట్రం నవ్యాంధ్రప్రదేశ్‌ను నిర్మించే క్రతువులో మీరు కూడా భాగస్వాములు కావాలని కోరుతున్నాను’ అని ముఖ్యమంత్రి కొరియా ఇన్వెస్టర్స్ ను కోరారు.

రాజధానికి అమరావతి కోసం జరిగిన  భూసమీకరణ గురించి కూడా ఆయన వివరించారు.‘రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం దగ్గర తగినంత భూమి లేదు.  భూముల సేకరణకు తగినన్ని నిధులు కూడా లేవు. విభజన వల్ల రాష్ట్రం  అసలే  సంక్షోభ పరిస్థితిలో ఉంది. నేను ఇచ్చిన ఒకే ఒక్క  పిలుపుతో 33 వేల ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి అందించారు,’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.  అమరావతిని ప్రపంచంలోని అత్యాధునిక 5 నగరాలలో ఒకటిగా ఉండేలా నిర్మిస్తున్నామని ప్రపంచం దృష్టిని తమవైపు తిప్పుకోగలిగామని ఆయన అన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి పెట్టుబడులతో వచ్చి పరిశ్రమల స్థాపన చేసే అంశంలో దక్షిణ కొరియాకు ప్రాధాన్యతనిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.  

ఏపీ సంగతి తెలుసుకోవాలంటే కియా మోటార్స్ ను అడగండి

మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులకు, వ్యాపారాలకు స్నేహపూర్వక వాతావరణం కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ సామర్ధ్యాన్ని కియో మోటార్స్ గుర్తించిందని, ఏపీ సమర్ధతను తెలుసుకోవాలంటే కియోప్రతినిధులను అడగినా చెబుతారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రహదారులు, రైలు మార్గాలు, ఓడరేవులు, విమానాశ్రయాలు, ఇతర మౌలిక సదుపాయాలతో అన్ని ప్రాంతాలకు అనుసంధానం కలిగిన రాష్ట్రం దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్ మాత్రమేనన్నారు. ఏపీలో పారిశ్రామికంగా ఉత్తమ విధానం అమలులో ఉందని, పెట్టుబడులకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు అత్యుత్తమ ప్యాకేజీ ఇస్తామన్నారు

click me!