
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పండగల సందడి సృష్టిస్తున్నారు. నంద్యాల ,కాకినాడ ఎన్నికల లో గెలిచిన నేపథ్యంలో ఇక ఆయన రెచ్చిపోయి ఉపన్యాసాలిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన పుష్కరాలను, తెలుగు పండగలను ప్రభుత్వ పండగలుగా మార్చేశారు. ఇపుడు తాను అపర భగీరథుడు అని అనిపించుకోబోతున్నారు. తెలంగాణాలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలో మంత్రులు, ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కెసిఆర్ ను అపర భగీరధుడు అని రోజూ చెబుతున్నారు. ఆ రెండూభారీ నీళ్ల కాల్వలు. ఇలాంటి భారీ కాల్వలు తవ్వేందుకు ఆంధ్రలో అవకాశం లేదు. ఎందుకంటే, ఉన్న ప్రాజక్టులన్నీ గతంలో ముఖ్యమంత్రి గా రాజశేఖర్ రెడ్డి పునాదిరాయివేసినవో లేక మరొకరు ప్రారంభించినవో. అందువల్ల మొత్తంగా చంద్రబాబు నాయుడు తవ్విన ప్రతికుంట,చెరువు, కాలువ, లిఫ్టులు, బోర్లు అన్ని కూడేసి, రాష్ట్రానికి లంకెబిందె లా గా ‘జలసిరి’ దొరికిందని చెప్పబోతున్నారు. అపుడు గాని ఆయన అపర భగీరధుడని అనలేరు. దీనికోసం రాష్ట్రంలో ఎక్కడ కుంట తవ్వారో, ఎక్కడ చెరువు కట్టారో, ఎక్కడ లిఫ్ట్ ఏర్పాటు చేశారో, ఎక్కడ బోరు వేశారో అక్కడంతా ‘జలసిరి’ హారతి పట్టి తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు ముఖ్యమంత్రిని అపరభగీరథుడు అనబోతున్నారు. నీళ్లలేక అల్లాడుతున్న వెనకబడిన ప్రాంతాలను, రైతుల ఆత్మహత్యలను....ఇంకా ఇతర ఇబ్బందికరమయిన అంశాలన్నింటిని ఈ కొత్తపండగకింద దాచిపెట్టేందుకు పెద్ద ప్రయత్నం సాగుతూ ఉంది. అక్కడక్కడ వర్షాలు వచ్చి కుంట,చెరువు నిండుగా కనిపిస్తున్న సమయాన్ని తెలివిగా జలసిరికి ముహూర్తంగా నిర్ణయించుకున్నారు. ఇదంతా చంద్రబాబు తెచ్చిన నీరేనని అనబోతున్నారు.
దీనికి తగ్గట్టుగా... ఈ హారతి కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. రాష్ట్రంలో 40,817 చెరువులు, 57,957 చెక్‌డ్యాంలు, ఫామ్ పాండ్స్, నీటి కుంటలు 6,17,718 తవ్వామని, పెర్కులేషన్ ట్యాంక్స్ 5,463 తవ్వగా, 1130 పనులను వివిధ స్కీమ్స్ కింద రైతాంగానికి మేలు జరిగే విధంగా చేశామని, 15 లక్షల వ్యవసాయ బోర్లు తవ్వామని అక్కడంతా ప్రతి ఒక్కరూ ఈ జలసిరి హారతి కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన చెప్పారు. యలమంచిలి వద్ద శారదా నదిపై కట్టిన ఆనకట్టపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సెప్టెంబర్ 7వ తేదీన జలసిరి హారతిలో స్వయంగా పాల్గొంటారన్నారు. మెట్ట ప్రాంతాల్లోని 4,80,000 ఎకరాల ఆయుకట్టు స్థిరీకరణ కోసం గోదావరి నదిపై రెండు లిఫ్టుల ద్వారా నీళ్లు తోడే ప్రాజక్టుకు మైలవరంలోని మద్దాలపురం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయడంతో పాటు జలసిరికి హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ నుంచి రాజమండ్రిలో 7వ తేదీ సాయంత్రం నిర్వహించే అఖండ గోదావరి హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతపురం జిల్లా ఉరవకొండ దగ్గర 830 కోట్ల రూపాయలతో చేపట్టే హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ పనులకు ఆ మరుసటి రోజు, సెప్టెంబర్ 8వ తేదీ ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 5 గంటలకు పవిత్ర సంగమం వద్ద జలసిరికి హారతి పడతారు.