
కాపు రిజర్వేషన్ల హామీని అమలుచేసే విషయంలో చంద్రబాబు నాయు ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని కాపు రిజర్వేషన్ పోరాట నాయకుడు ముద్రగద పద్మనాభం చెప్పారు. ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ముద్రగడ ప్రభుత్వానికి ఒక అవకాశమీయడం విశేషం.
ఈ రోజు కాకినాడలో విలేకరులతో మాట్లాడుతూ కాపు రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి చర్చలకు ఆహ్వానిస్తే తమ తరపున ఐదుగురిని పంపిస్తామని చెప్పారు.
చర్చల అవకాశాన్ని వినియోగించుకుని, ఒకపరిష్కార మార్గం కనుగొనకపోతే, మే 7 నుంచి కాపు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ముద్రగడ హెచ్చరించారు.
మే నెల 7లోగా హమీని నిలబెట్టుకోవాలని, నిజాయితీ నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సలహా ఇచ్చారు.
ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే అదేరోజు కాపు జేఏసీతో సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.
‘కాపు ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు తనకున్న రాజకీయానుభవాన్నంతా ప్రయోగిస్తున్నారు. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేసే కుట్రలు చేస్తున్నారు. కాపు సోదరులు అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాలను చంద్రబాబు గ్రహించడం మంచిది,’ అని ముద్రగడ అన్నారు.
‘ఒక పెద్ద రచయిత చెప్పినట్టుగా కాపులను గిల్లుతూ బీసీలకు జోల పాటు పాడుతున్నారు,’ అని ముద్రగడ వ్యాఖ్యానించారు.