
బ్రాహ్మణ కార్పొరేషన్ ఛెయిర్మన్ గా రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు తొలగించిన తర్వాత గుర్రుగా బ్రాహ్మణులకు కాపు రిజర్వేషన్ పోరాట నాయకుడు ముద్రగడ పద్మనాభం మద్దతు తెలిపారు. 2019 ఎన్నికల్లో బ్రాహ్మణులు కూడా తమ సత్తా ఏమిటో చూపించాలని ఆయన పిలుపునిచ్చారు.
సోమవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మీద ఆయన మరొక అస్త్రం సంధించారు. చంద్రబాబుకు బాగా చురకలంటించారు. లేఖను విడుదలచేస్తూ మాట్లాడారు.
కాపు రిజర్వేషన్ల మీద ముఖ్యమంత్రి ఇటీవల విశాఖ మహానాడులో కొత్త పల్లవి ఎత్తుకోవడానికి ఆయన తీవ్ర అభ్యంతరం చెప్పారు.
ప్రజలతో, బిసి సంఘాలనేతలో చర్చించి తర్వాత కాపు రిజర్వేషన్ల మీద తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇపుడు మాట మార్చడం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
‘ప్రజలతో , బిసినేతలతో చర్చించి 100 శాతం ఏకాభిప్రాయం తర్వాత(కాపు) రిజర్వేషన్ల మీద నిర్ణయం తీసుకుంటామని తమరుఇటీవలే సెలవిచ్చారు. దేశమంతా పర్యటించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఉంటే ఇంకా బాగుండేది. ఈ చిలుకపలుకులు ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడినప్పుడు, పార్టీ మ్యానిఫెస్టోలో రిజర్వేషన్ల అంశం పెట్టినపుడు ఎందుకు గుర్తు రాలేదు? బిసిలో కోటాలో మా జాతికి వాటా ఇవ్వాలని మేం అడగడం లేదే,’ అని ముద్రగడ అన్నారు.
కాపులను ప్రత్యేక క్యాటగిరి బిసిలు ప్రకటించి, వారికి ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఇవ్వాలని మాత్రమేకోరుతున్నామని ఆయన చెప్పారు.
‘బిసిలకు అన్యాయం జరగకుండా రిజర్వేషన్లు ఇస్తామని పదేపదే మీరు చెబుతున్నారు. మా మధ్య తగవులు పెట్టి పబ్బం గడుపుకోవాలనుకోవానుకోవడం మీక అలవాటైంది. మూడేళ్లుగా రిజర్వేషన్లను డీప్ ఫ్రీజ్ లో పెట్టి 2019లో మళ్లీ మా వాళ్లతో ఓట్లు రాబట్టుకోవాలనుకునే మీ కుట్రను తెలుసుకోలేనంత స్థితిలో మా జాతి లేదు. కాపు రిజర్వేషన్ల పై ప్రపంచ వ్యాపింతంగా పర్యటించి ఏకాభిప్రాయానికి రండి. అపుడు మీ ఖ్యాతి ఖండాంతరంగా విరాజిల్లుతుంది,’ అని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు.
ఐవై ఆర్ కృష్ణారావువ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పు చేశారని ముద్రగడ అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో బ్రాహ్మణులు నిరూపించాలని ఆయన అన్నారు.
ఛలో అమరావతి యాత్ర ప్రకటించినట్లు జూలై 26న ప్రారంభవుతుందని పునరుద్ఘాటించారు.