
పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో 3800 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఈ గ్రామంలో 12 కులాలవారు నివాసముంటున్నారు. అగ్రవర్ణ భూస్వాములు 800 మంది, దళితులు 750 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ప్రాంతంలో మొత్తం 3 వేల ఎకరాల సాగుభూమి ఉంటే పెత్తందారుల చేతిలో 2,400ల ఎకరాలు ఉంది. దళితులు 300 కుటుంబాలకు గాను కేవలం 16 కుటుంబాలకు మాత్రమే 25 ఎకరాల భూమి ఉంది. అంటే మొత్తం భూమిలో 1 శాతం లోపే. అక్కడున్నవారంతా దళితులంతా వ్యవసాయ కార్మికులే. అక్కడి నుండి 100 మందికిపైగా దళిత మహిళలు 25 మంది పురుషులు గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళారు. రిజర్వేషన్ రీత్యా సర్పంచ్, ఎంపిటిసి పదవులకు ఇద్దరూ దళితులే ఎన్నికయ్యారు. వీరిద్దరూ అధికార తెలుగుదేశం పార్టీకి చెందినవారే.
భూస్వాముల కక్షసాధింపు చర్యలు
126వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటు చేసుకోవాలని దళిత యువకులంతా భావించారు. అసలు ఈ భావనను గత స్థానిక ఎన్నికల సందర్భంగా కలిగించింది టిడిపికి చెందిన అగ్రవర్ణ భూస్వాములే. సర్పంచ్, ఎంపిటిసిలను గెలిపిస్తే తక్షణ తాయిలాలతోపాటు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకోవడానికి అర్ధిక సహకారం అందిస్తామని వాగ్దానం కూడా చేశారు. అయితే అసలు సమస్య అంబేద్కర్ విగ్రహానికి దళితులు ఎంచుకున్న స్థలమే అగ్రవర్ణ పెత్తందారుల ఆగ్రహానికి కారణమయ్యింది. గ్రామం మధ్యలో మంచినీటి చెరువు ఉంది. ఆ చెరువు చుట్టూ రెండు రామాలయాలు, ఆంజనేయస్వామి, వినాయకుడు, వెంకటేశ్వరస్వామి, కృష్ణుడి ఆలయాలు ఆయా ప్రాంతాలలో ఉన్నాయి. మరో ప్రాంతంలో గాంధీ, అల్లూరి సీతారామరాజు, పొట్టిశ్రీరాములు, కాటన్, ఈ మధ్యనే తాండ్రపాపారాయుడు విగ్రహాలు నెలకొల్పారు. దళితులు కూడా చెరువు గట్టుప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 14వ తేదీ నాటికి విగ్రహానికి డబ్బులు జమ కాకపోవడంతో ఫ్లెక్సీ(బ్యానర్)తో జయంతి ఏర్పాటు చేసారు. ఇందుకు ఆగ్రహించిన పెత్తందార్లు పోలీసులను రంగంలోకి దింపి దళితుల్ని బెదిరించారు. అయినా దళితులు ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఏప్రిల్ 23 తేదీ ఫ్లెక్సీ స్థానంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రాత్రికి రాత్రే పెత్తందార్లు విగ్రహాన్ని మాయం చేశారు.
24వ తేదీ దళితులు పెద్దఎత్తున ఆందోళనకు దిగడంతో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న సబ్‌కలెక్టర్ పెత్తందార్ల స్వాధీనంలో ఉన్న విగ్రహాన్ని తెప్పించారు. అప్పటికే అప్రమత్తమయిన పెత్తందార్లు హైకోర్టు నుండి చెరువు గట్టుపై విగ్రహాలు పెట్టరాదని తెచ్చిన స్టే ఆర్డరు చూపించారు. దీంతో సబ్‌కలెక్టర్ విగ్రహాన్ని తాత్కాలికంగా పంచాయితీ ఆఫీసు వద్ద పెట్టించారు. ఈ చర్య పెత్తందారుల ఎత్తుగడను బెడిసి కొట్టినట్టయ్యింది. దీంతో రెచ్చిపోయిన పెత్తందార్లు గ్రామంలోని ప్రభావిత బిసి కులాలను కూడగట్టి శివాలయంలో మీటింగ్ పెట్టి సాంఘిక బహిష్కరణకు పిలుపునిచ్చారు.
దళితుల చేతుల్లో ఉన్న కౌలు భూములన్నీ తీసుకోవాలని, కూలి పనులకు పిలవరాదని, చెరువులు, ఇళ్ళల్లో పనులు చేస్తున్నవారిని తొలగించాలని వారితో మాట్లాడితే వెయ్యి రూపాయలు జరిమానా, పనులకు పిలిస్తే పదివేల రూపాలయలు జరిమానా వేయాలని నిర్ణయించారు.
భూములు లాక్కున్న పెత్తందారులు
మే 5వ తేదీ నుండి పెత్తందార్లు తమ ప్రతాపాన్ని మొదలెట్టారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న 60 మంది దళితుల నుండి భూములను లాక్కున్నారు. మూడుతరాల నుండి సాగుచేస్తున్న భూమిని లాగేసుకోవడంతో రాజేష్ భీమవరంలో ఫ్యాక్టరీ పనులకు వెళ్తున్నాడు. గుడిసె మరియమ్మ భర్త 8 మాసాల క్రితం చనిపోవడంతో ఇల్లు గడవక రెండు నెలల నుండి ఇళ్లల్లో పనులకు వెళ్తుండేది. ఆమెనీ పనికి రావద్దని మాన్పించేశారు, ఎవరినీ కూలీ పనులకు పిలవకపోవడంతో గ్రామం వదలి బయట పనులకు వెళ్తున్నారు. అంతేకాక దళితపేట కూడలిలో సిసి కెమేరాలను అమర్చి వారి స్వేచ్చను హరిస్తున్నారు. 45 రోజుల నుండి బహిరంగంగా ఇంత దారుణంగా వివక్ష కొనసాగుతున్నా మోడి - బాబు ప్రతినిధులైన స్థానిక ఎంపి, ఎంఎల్‌ఎ ఇద్దరూ పెత్తందారులకే ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు. తెరవెనుక కథ నడపడంతో అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. ఐఏఎస్ స్థాయి అధికారి కూడా విషయం చాలా బాధాకరమే కాని మా మీద చాలా ఒత్తిడులు ఉన్నాయని నిస్సాహయత వ్యక్తం చేస్తున్నారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ ఘటనపై కెవిపిఎస్, వ్యవసాయ కార్మిక సంఘాలు, దళితులకు అండగా నిలబడ్డాయి. సిపిఎం జిల్లా నాయకులు తప్పకుండా గ్రామంలో పర్యటించి ఐక్యంగా ఉండి పోరాడాలని సిపిఎం తోడుగా ఉంటుందిన భరోసా ఇచ్చారు.
- జె.ఎన్.వి.గోపాలన్, జిల్లా సిపిఎం కార్యదర్శి వర్గసభ్యులు, (‘ప్రజాశక్తి’ నుంచి పునర్ముద్రితం)