
ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-శ్రీలంకల మధ్య ఆదివారం జరిగిన మూడో వన్డే లో ధోని ఆట మధ్యలో కాసేపు నిద్రపోయారు. ఆయన అలా నిద్రపోతుండగా తీసిన ఫోటో ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళితే.. మూడో వన్డేలో భారత్ లక్ష్యానికి చేరువలో ఉంది. ఆ సమయంలో ఓటమిని జీర్ణించుకోలేని శ్రీలంక అభిమానులు స్టేడియంలోకి వాటర్ బాటిల్స్ విసిరి తమ నిరసనను వ్యక్తం చేశారు. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. 44వ ఓవర్ జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సమయంలో రోహిత్ శర్మ 122, ధోని 61 పరుగులతో క్రీజులో ఉన్నారు. అప్పటికే బాగా అలసిపోయిన ధోని విరామం దొరకడంతో హెల్మెట్, గ్లౌజులు తొలగించి క్రీజులో బోర్లా పడుకుని విశ్రాంతి తీసుకున్నాడు.
తర్వాత మ్యాచ్ తిరిగి కొనసాగింది... భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు ధోని ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు పెడుతున్న కామెంట్లు నవ్వులు తెప్పిస్తున్నాయి. ధోని నిద్రిస్తున్న ఫోటోని.. మోదీ నిద్రిస్తున్న ఫోటోని పోల్చుతూ.. ధోని న్యూ ఇండియా కోసం ప్రిపేర్ అవుతున్నారంటూ పలువురు కామెంట్లు చేశారు. మరొకరేమో.. ఉదయం కదా.. ఇంకో 5 నిమిషాలు ఇవ్వండి పడుకోవడానికి అంటూ ధోనిని ఉద్దేశిస్తూ కామెంట్ చేశారు. ఇంకొకరేమో.. నిజంగానే నిద్రపోయాడా.. లేదా నిద్రపోయినట్లు నటిస్తున్నాడా అంటూ పోస్టు చేశారు.