
ఓ మహిళ తన కుమార్తె వివాహానికి ఏకంగా వాళ్ల దేశ అధ్యక్షుడినే ఆహ్వానించింది. ఆ విషయం పెళ్లి కుమార్తె కు కూడా తెలీదు. వారి వివాహం జరిగిన తర్వాత దేశాధ్యక్షుడి నుంచి వచ్చిన రెస్పాన్స్ కి నూతన దంపతులు, వారి కుటుంబసభ్యలు ఆశ్చర్యానికి గురయ్యారు. వివరాల్లోకి వెళితే..
టెక్సాస్‌లో నివసిస్తున్న బ్రూక్ అలెన్ అనే యువతి వివాహం ఈ ఏడాది మార్చిలో జరిగింది. అయితే గత ఏడాది డిసెంబర్‌లోనే పెళ్లి పత్రికలను పంచే పనిలో ఆమె తల్లి లిజ్ విట్లో నిమగ్నమైంది. ఆమె ఏకంగా అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రథమ మహిళ మిషెల్ ఒబామకు ఆ ఆహ్వాన పత్రికలను పోస్ట్ చేసింది. కూతురికి మాత్రం ఈ విషయం తెలియదు. పెళ్లి అయిన అనంతరం ఒబామా దంపతుల నుంచి వివాహ శుభాకాంక్షలు చెబుతూ వారికి జులై 27న ఓ లేఖ అందింది. అందులో ‘ప్రేమ, ఆనందంతో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం. ఏళ్లు గడిచేకొద్ది మీ వివాహ బంధం మరింత దృఢంగా మారాలని కోరుకుంటున్నాం’ అని రాసుంది. చివరగా ఒబామా దంపతుల సంతకాలు అందులో ఉన్నాయి. ఈ లేఖను చూసిన అనంతరం ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమకు ఏకంగా ఒబామా దంపతులు శుభాకాంక్షలు చెప్పినందుకు ఆ జంట మురిసిపోతోంది. ఆ లేఖకు సంబంధించిన ఫొటోలను బ్రూక్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ప్రస్తుతం ఆ లేఖ వైరల్ గా మారింది.