
రాజ్యసభలో ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ఓ వ్యాఖ్య దుమారం రేపింది. అంతర్జాతీయస్థాయిలో గొప్ప ఆర్థికవేత్తగా పేరున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను ఉద్దేశిస్తూ దేశ ప్రధాని మాట్లాడిన తీరుపై ప్రతిపక్షాలే కాదు నెటిజన్లు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు.
రాష్ట్రపతి ప్రసంగానికి కృతజ్ఞతలు చెప్పే తీర్మానం సందర్భంగా సభ లో చర్చ జరుగుతోంది. ఈ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ...
‘ దేశ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయడానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చాలా ఏళ్లుగా కృషి చేశారు. అయినా ఆయన మీద ఇప్పటి వరకు ఎలాంటి ఆరోపణలు రాలేదు. బాత్ రూంలో రెయిన్ కోట్ వేసుకొని తడవకుండా స్నానం చేసే కళను ఆయనే నేర్పాలి’ అని అన్నారు.
దీంతో సభ లో ఉన్న కాంగ్రెస్ ఎంపీలతో సహా ప్రతిపక్ష నేతలు కూడా ప్రధాని వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి పెద్దల సభలో అలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని పేర్కొన్నారు. ప్రధాని వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు.
మరోవైపు ప్రధాని హాట్ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆర్థికమేధావిగా ప్రతిపక్షాల నుంచి కూడా మన్నలను అందుకునే మన్మొహన్ పై ప్రధాని తన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడలేకపోయారని నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పార్లమెంట్ పంచ్ లు వేసే టీ కొట్టులా తయారైందని ఒకరు ట్వీటితే... 11 లక్షల సూట్ ధరించిన ప్రధానికి మన్మొహన్ రెయిన్ కోట్ అవసరమా అని మరొకరు ట్వీటారు.
మోదీ జీ... మన్మోహన్ సింగ్ బాత్ రూం కు మీరెప్పుడు వెళ్లారంటూ ఓ నెటిజన్ ప్రశ్నించాడు.