
గాంధీ హాస్పిటల్ లోని మోడ్రస్ ఐసీయూకి జబ్బు చేసింది. ఆగస్టు 10వ తేదీన 65 పడకల మోడ్రన్ ఐసీయూ యూనిట్ ని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రారంభించి నెల రోజులు కూడా గడవక ముందే.. మూలన పడింది. శిక్షణ పొందిన స్టాఫ్ లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
ఈ యూనిట్ ప్రారంభించడానికి ముందే గాంధీ హాస్పిటల్ అధికారులు తమకు శిక్షణ పొందిన సిబ్బంది కావాలంటూ ఆరోగ్య శాఖ మంత్రికి, సంబంధిత ఆరోగ్య శాఖ అధికారులను కోరారు. కానీ.. యూనిట్ ప్రారంభించిన తరువాత కూడా సిబ్బందిని పంపలేదు.. సరికదా వారి నుంచి ఎలాంటి సమాధానమూ లేదు.
ఒక రోజులో గాంధీ హాస్పిటల్ కి క్యాజువాలిటీ వార్డుకి 350 మంది రోగులు చికిత్స నిమిత్తం వస్తున్నారు. కాగా.. హాస్పిటల్లో మాత్రం క్యాజువాలిటీ వార్డులో 30 పడకలు, ఏఎంసీ వార్డులో మరో 30 పడకలు మాత్రమే ఉన్నాయి. దీంతో రోగులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.హాస్పిటల్ లో కొత్త గా ఐసీయూ యూనిట్ ని ప్రారంభిస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందని డాక్టర్లు భావించారు. కానీ.. వారి ఆశ నిరాశగా మారింది.
హాస్పిటల్ లో రోగి వెంటిలేటర్ పై ఉంటే.. ఆ రోగికి ప్రత్యేకంగా ఒక నర్సు అవసరం ఉంటుంది. అలా లేకపోతే.. ఒక్కో నర్సు ఇద్దరు రోగుల బాధ్యతలు చూసుకోవాలి. ప్రతి షిప్ట్ కి ఆరు నుంచి 12 మంది రోగులకు ప్రత్యేకంగా ఒక హెడ్ నర్సు, ఇంఛార్జ్ నర్సులు ఉండాలి. ఈ లెక్కన గాంధీ హాస్పిటల్ లోని ఐసీయూ యూనిట్ కి 10 మంది హెడ్ నర్సులు, 15మంది ఇంఛార్జ్ నర్సులు, 195 మంది స్టాఫ్ నర్సులు అవసరం. వీరందరికీ శిక్షణ కూడా చాలా అవసరం. వీరిని ఆరోగ్య శాఖ అధాకారులు కేటాయిస్తే తప్ప.. రోగుల బాధలు తీరవు.