మానుషి అడుగులు కూడా బాలీవుడ్ వైపేనా?

First Published Nov 19, 2017, 10:59 AM IST
Highlights
  • మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న మానుషి చిల్లార్
  • గతంలో మిస్ వరల్డ్ గా నిలిచిన ఐశ్వర్యారాయ్, ప్రియాంక చోప్రా

తాజాగా మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్న మానుషి చిల్లార్ అడుగులు బాలీవుడ్ వైపేనా? ఇప్పుడు అందరినోటా ఇదే ప్రశ్న వినపడుతోంది. ఎందుకంటే.. ఇప్పటి వరకు మిస్ వరల్డ్, మిస్ ఇండియా గా గెలిచిన వారంతా.. వారి అదృష్టాన్ని బాలీవుడ్ లో పరీక్షించుకున్న వాళ్లే. అందులో అందరూ సక్సెస్ కాకపోయినా.. కొందరు మాత్రం తారా స్థాయికి చేరుకున్నారు. వాళ్లలాగానే మానుషి కూడా ఆ వైపు అడుగులు వేస్తుందా అనే ప్రశ్న ఇప్పుడు అందరి నోటా వినిపిస్తోంది.

మిస్ వరల్డ్ కిరీటాన్ని భారతీయ యువతి మానుషి చిల్లార్  తాజాగా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 17 సంవత్సరాల తర్వాత భారత్ కి తిరిగి మిస్ వరల్డ్ కిరీటం దక్కింది. చైనాలోని సన్యా సిటీ ఎరీనా ప్రాంతంలో జరిగిన 67వ మిస్ వరల్డ్ పోటీల్లో పలు దేశాలకు చెందిన 118 మంది ముద్దుగుమ్మలు పాల్గొన్నారు. కాగా వారిలో హర్యానాకు చెందిన 21ఏళ్ల వైద్య విద్యార్థిని మానుషి.. విజేతగా నిలిచింది.

గతంలో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న సుందరీమణులు వీరే..

భారత్ కి తొలిసారి మిస్ వరల్డ్ కిరీటం దక్కింది 1966లో. రీటా ఫరియా అనే యువతి తొలిసారి ఈ కిరీటాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత ఆమె తన వైద్య వృత్తిని కొనసాగించారు.  ఆ తర్వాత జరిగిన ఎన్నో అందాల పోటీలకు ఆమె న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించారు.

రీటా తర్వాత మళ్లీ ఆ కిరీటాన్ని దక్కించుకుంది ఐశ్వర్యారాయ్. 1994లో మిస్ ఇండియా రన్నరప్ గా నిలిచిన ఐశ్వర్యారాయ్.. ఆ తర్వాత అదే సంవత్సరంలో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచింది. ఆ తర్వాత.. ఆమె బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన సంగతి మన అందరికీ తెలిసిందే.

రీటా, ఐశ్వర్యారాయ్ స్ఫూర్తితో ఈ రంగంపై అడుగులు వేసింది డయానా హైడెన్. ఈమె భారత్ కి మూడో ప్రపంచ కిరీటాన్ని తెచ్చిపెట్టింది. 1997లో ఫెమినా మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్న డయానా.. ఆ తర్వాత అదే సంవత్సరం నిర్వహించిన  మిస్ వరల్డ్ పోటీల్లో విజయం సాధించింది. ఆ తర్వాత బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అనుకున్నంతగా రాణించలేకపోయింది.

యుక్తాముఖి.. 1999లో మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది. ఈ కిరాటాన్ని గెలచుకునే సమయంలో ఆమె వయసు 20 సంవత్సరాలు. ఈమె కూడా ఐశ్వర్యారాయ్ లాగా   బాలీవుడ్ లో సినీరంగ ప్రవేశం చేసింది. కానీ ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద డీలా పడటంతో.. ఆమె సినీ రంగంలో గుర్తింపు సాధించలేకపోయింది.

ప్రియాంక చొప్రా.. 2000లో ఫెమినా మిస్ ఇండియా కాంటెస్ట్ లో గెలుపొందిన తర్వాత మిస్ వరల్డ్ పోటీలకు సిద్ధపడింది. ఆ పోటీల్లో గెలిచి కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లో అడుగుపెట్టి.. విజయం సాధించింది. ఐశ్వర్యారాయ్ తర్వాత.. సినిమాల్లో సక్సెస్ సాధించిన మిస్ వరల్డ్ ప్రియాంక మాత్రమే. ప్రస్తుతం ప్రియాంక.. హాలీవుడ్ చిత్రాల్లోనూ నటిస్తూ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే.



 

click me!