
నా కుమారుడికి సహాయం చేయండంటూ ప్రముఖ సినీ నటి సుహాసినీ మణిరత్నం అభిమానులను కోరారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం, నటి సుహాసిని దంపతుల కుమారుడు నందన్ ఇటలీలో దోపిడీకి గురయ్యారు. ఈ విషయాన్ని సుహాసిని ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఇటలీలోని వెనిస్ విమానాశ్రయం దగ్గర్లో ఎవరైనా తెలిసిన వారుంటే తమ కుమారుడికి సాయం చేయాల్సిందిగా కోరారు.
‘ఎవరైనా వెనిస్ ఎయిర్‌పోర్ట్ వద్ద ఎవరైనా ఉన్నారా..? ఉంటే మా అబ్బాయికి సాయం చేయండి ప్లీజ్. అతను బెలున్నో ప్రాంతంలో ఉండగా దోపిడీకి గురయ్యాడు. వెనిస్‌లో ఉండి సాయం చేయలేని వారెవరూ నేను పోస్ట్ చేసిన మా అబ్బాయి ఫోన్ నెంబర్‌కు దయచేసి ఫోన్ చేయకండి. ఎందుకంటే అతని ఫోన్‌లో బ్యాటరీ తక్కువగా ఉంది. మేము అతనితో కాంటాక్ట్‌ను కోల్పోయే అవకాశం ఉంది’ అని ట్వీట్ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే నందన్ క్షేమంగానే ఉన్నాడని ఓ హోటల్‌లో దిగాడని ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు. తమ కుమారుడికి సాయం చేసిన వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు.