
కొందరు పెద్దల ఇళ్ళల్లో జరిగిన వివాహాలపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. కరెన్సీ సంక్షోభం దెబ్బకు మధ్య, ఎగువ తరగతి కుటుంబాల్లో జరగాల్సిన వివాహాలు వాయిదా పడుతున్నాయి. వివాహ ఏర్పాట్ల ముందస్తు ఖర్చులకు, వివాహం రోజు జరిగే ఖర్చులతో పాటు ఇతరత్రా ఖర్చులకు సరిపడా డబ్బులేక దేశంవ్యాప్తంగా కొన్ని వందల వివాహాలు వాయిదా పడుతున్నాయి.
పిల్లల వివాహాలున్నాయని తల్లి, దండ్రులు ఎంత మొత్తుకున్నబ్యాంకులు ఏమాత్రం కనికరం చూపటం లేదు. దేశవ్యాప్తంగా మొదలైన ఆందోళన తర్వాత కేంద్రప్రభుత్వ కాస్త దిగివచ్చింది. వివాహం జరుగుతున్నట్లు ఆధారాలు చూపితే రూ. 2.5 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ కేంద్రం మౌఖిక ఆదేశాలు జారీ చేసింది.
ఆదేశాలు మౌఖికమే కావటంతో చాలా బ్యాంకులు సదరు ఆదేశాలను ఖాతరు చేయటం లేదు. దాంతో చేసేది లేక వివాహలను వాయిదా వేసుకుంటున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కేంద్రం ఆదేశాలు ఈ విధంగా ఉంటే, కొందరు పెద్దల ఇళ్ళలో మాత్రం వివాహాలు చాలా అట్టహాసంగా జరుగుతుండటంపై సర్వత్రా చర్చ మొదలైంది.
సమాజానికి ఆదర్శప్రాయంగా ఉండాల్సిన సదరు పద్ద మనుషులు తమ హోదాను ప్రదర్శించేందుకు మొగ్గు చూపతుండటం గమనార్హం. ఇందుకు ఉదాహరణలుగా కొన్ని వివాహాలను చూడవచ్చు. పెద్ద నోట్ల రద్దు తర్వాత గాలి జనార్ధనరెడ్డితో పాటు కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, అరుణ్ జైట్లీ, జాతీయ భాజపా అధ్యక్షుడు అమిత్ షా పిల్లల వివాహాలు జరిగాయి.
పైన పేర్కొన్న ప్రముఖులందరూ భారీ ఎత్తున డబ్బు ఖర్చు చేసి ఎంతో ఆడంబరంగా తమ పిల్లల వివాహాలను జరిపారు. అంటే దేశమంతా ఎదుర్కొంటున్న నోట్ల రద్దు సంక్షోభం వారి ఆడంబరాలకు ఏమాత్రం ఆటకం కలగించలేదు.
జరుగుతున్న ప్రచారం బట్టి గాలి జనార్ధనరెడ్డి కుమార్తె వివాహానికి అయిన ఖర్చు సుమారు రూ. 500 కోట్లు. అరుణ్ జైట్లీ కుమార్తె వివాహానికి అయిన ఖర్చు సుమారు 200 కోట్లు. నితిన్ గడ్కరీ అయితే తన కుమార్తె వివాహానికి పలు ప్రాంతాల నుండి హాజరయ్యే ప్రముఖుల రాకపోకలకు ఏకంగా 10 విమానాలను ఉపయోగించారు. అంటే ఇతరత్రా జరిగిన వ్యయం గురించి ఎవరికి వారే ఊహించుకోవాలి.
అదేవిధంగా భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా తన కుమారుని వివాహానికి వందల కోట్ల రూపాయలు వ్యయం చేసారని సమాచారం. ఇక వీరు కాకుండా, కర్నాటకలోని ఓ కాంగ్రెస్ ప్రజాప్రతినిధి, ఏపిలోని టిడిపి శాసనసభ్యుడు తమ పిల్లల వివాహాలకు కోట్ల రూపాయలను విచ్చల విడిగా వ్యయం చేయటం గమనార్హం.