వంద కోట్లు.. ఇంకా...: బిజెపిపై కుమారస్వామి సంచలన ఆరోపణలు

First Published May 16, 2018, 1:42 PM IST
Highlights

బిజెపిపై జెడిఎస్ నేత కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

బెంగళూరు: బిజెపిపై జెడిఎస్ నేత కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని, వంద కోట్ల రూపాయలతో పాటు కేబినెట్ మంత్రి పదవిని ఆశ పెడుతోందని ఆయన అన్నారు. 

బుధవారం బెంగళూరులోని ఓ హోటల్లో జరిగిన జెడిఎస్ శాసనసభా పక్ష సమావేశంలో శాసనసభా పక్ష నేతగా ఆయన ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ కమల్ విజయవంతమైందని బిజెపి నాయకులు సంబరపడుతున్నారని, కానీ బిజెపి ఎమ్మెల్యేలు కూడా తమతో రావడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. 

తమ పార్టీ నుంచి బిజెపి ఒక్క ఎమ్మెల్యేలను లాక్కుంటే తాము ఆ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలను లాక్కుంటామని హెచ్చరించారు. ఎమ్మెల్యేల బేరసారాలకు అవకాశం కల్పించే నిర్ణయం తీసుకోవద్దని ఆయన గవర్నర్ ను కోరారు. 

ఉత్తరాదిన విజయవంతంగా సాగిన బిజెపి అశ్వమేథయాగానికి కర్ణాటకలో పుల్ స్టాప్ పడిందని, కర్ణాటక ఫలితాలు బిజెపి అశ్వమేథ యాగాన్ని అడ్డుకున్నాయని అన్నారు. తమ పార్టీలో చీలిక వస్తుందని తప్పుడు ప్రచారం సాగించారని, తమ ఎమ్మెల్యేలను లాక్కోవడానికి బిజెపి కుట్ర చేస్తోందని ఆయన విమర్శించారు.

బిజెపికి వచ్చిన 104 సీట్లు మోడీ ప్రచారం వల్ల వచ్చినవి కావని, సెక్యులర్ పార్టీల ఓట్లు చీలడం వల్ల ఆ సీట్లు వచ్చాయని, కర్ణాటక ఫలితాలు మోడీ, బిజెపి విజయం కాదని అన్నారు. ప్రధాని మోడీ అధికార దుర్వినియోగం చేస్తున్నారని, స్వయంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆయన అన్ారు.  

click me!