కన్నడ బిజెపికి రేవణ్ణ మొండిచేయి

First Published May 16, 2018, 12:45 PM IST
Highlights

కన్నడ నాట కొత్త ట్విస్ట్

బొటాబొటి సీట్లతోనైనా అధికారం పీఠమెక్కాలని ఆశపడ్డ కన్నడ బిజెపికి జెడిఎస్ నేత, దేవేగౌడ్ పెద్ద కుమారుడు రేవణ్ణ షాక్ ఇచ్చినట్లే కనబడుతున్నది. అధికారం పీఠమెక్కాలంటే బిజెపికి మరో 8 సీట్లు తక్కువ పడ్డాయి. దీంతో ఫిరాయింపులపై బిజెపి దృష్టిసారించిందన్న వార్తలొచ్చాయి. తమకు వారం రోజులు గడువిస్తే బలాన్ని నిరూపించుకుంటామంటూ బిజెపి నేత, మాజీ సిఎం యడ్యూరప్ప గవర్నర్ కు వినతిపత్రం ఇచ్చారు. ఇప్పటికే బిజెఎల్పీ నేతగా యడ్యూరప్ప ఎన్నికయ్యారు.

ఈ పరిస్థితుల్లో జెడిఎస్ లోని రేవణ్ణ వర్గాన్ని గుంజి తమకు మద్దతు తీసుకుని సర్కారు ఏర్పాటు చేస్తారని జిజెపి నేతలపై పుకార్లు వచ్చాయి. రేవణ్ణ క్యాంపులో 12 మంది జెడిఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారని వారంతా బిజెపి వైపు వస్తారని ఊహాగానాలు సాగాయి. రేవణ్ణకు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తారని, ఫిరాయించి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు ఇస్తారని కూడా ప్రచారం సాగింది. ఇదంతా నిన్నటి మాట. కానీ నేడు రేవణ్ణ బిజెపి ఆశలపై నీళ్లు చల్లారు. బిజెపికి మొండి చేయి ఇచ్చారు.

జెడిఎస్ లో ఎలాంటి చీలక లేదని రేవణ్ణ ప్రకటించారు. జెడిఎస్ శాసనసభా పక్స నేతగా కుమారస్వామిని ఎన్నుకున్నట్లు ప్రకటించారు. తాను బిజెపికి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఆయన ఆషామాషీగా కూడా చెప్పలేదు. కుమారస్వామితోపాటే మీడియా ముందుకు వచ్చి ఈ విషయాలను వెల్లడించారు. ఇక ఈ మీడియా సమావేశంలో కుమార స్వామి బిజెపి పై నిప్పులు చెరిగారు. తమ పార్టీని చీల్చేందుకు బిజెపి ప్రయత్నిస్తోందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అడ్డదారిలో బిజెపిని అధికారంలో కూర్చోబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బిజెపి వద్ద ఉన్న నల్ల ధనంతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఈ ఫలితాలు తమకు సంతృప్తిని ఇవ్వలేదని అయినా, తమ పార్టీకి ఓటేసిన కన్నడ ప్రజలకు కుమారస్వామి ధన్యవాదాలు తెలిపారు.

click me!