
ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదిరోజుల పాటు నంద్యాల నియోజకర్గంలో పర్యటించి నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం చేయబోతున్నట్లు తెలిసింది.
ఆయన పర్యటన వివరాలు ఇంకా ఖరారు కాలేదు.అయితే, పది రోజుల పాటు ఉండేందుకు కార్యక్రమం రూపొందుతూ ఉందని పార్టీ ప్రతినిధి ఒకరు ‘ఏషియానెట్’కు తెలిపారు. బహుశా నోటిఫికేషన్ విడుదల అనంతరం ఈ పర్యటన ఉండవచ్చని అన్నారు.
నంద్యాల లో జరిగేది ఉప ఎన్నికే అయినా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికను తన ప్రభుత్వం మీద రెఫరెండం స్థాయికి తీసుకువెళ్లారు. దానికి తగ్గట్టుగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇది రెఫరెండమే అన్నారు.
వాళ్లు అన్నా అనకపోయినా, మూడేళ్ల తర్వాత వచ్చిన ఉప ఎన్నిక కావడం, చంద్రబాబు ప్రభుత్వం పనితీరు నంద్యాల ప్రజలు చూసి ఉండటం, ఒక ఫిరాయింపు దారుడి నియోజకవర్గంలో ఎన్నిక జరుగుతూ ఉండటం, ప్రతిపక్షపార్టీ చంద్రబాబు పాలన మీద ప్రజల తీర్పుగా మార్చడంతో , ప్రజలు దీనిని రెఫరెండంగానే భావించే అవకాశం ఉంది.ఆ విధంగా ఎన్నికల పండితులు, రాజకీయ పండితులు ఎన్నికల ఫలితాలకు భాష్యం చెప్పే అవకాశం ఉంది. ఇది గ్రహించినందునే ముఖ్యమంత్రి ఇప్పటికే రెండు సార్లు నంద్యాల నియోజకవర్గానికి వచ్చారు. ఇంకా అనేక సార్లు వస్తానంటున్నారు. కొడుకు,ఐటి మంత్రి నారా లోకేశ్ ను పంపారు. మంత్రులను పంపారు. వరాలకు కుమ్మరిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే జగన్ సుడిగాలి పర్యటనకు ఏర్పాట్లు జరగుతున్నాయి. కనీసం వరుసగా పది రోజులు ఆయన నంద్యాల క్యాంపు వేస్తారని చెబుతున్నారు.