
అమరావతికి అటూ ఇటూ టెన్షన్ పెరుగుతూ ఉంది. ఒక వైపు ముద్రగడ పాదయాత్ర టెన్షన్ ... మరొక వైపు నంద్యాల ఉప ఎన్నిక టెన్షన్.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెన్షన్ మధ్య అటూ ఇటూ తిరుగుతున్నారు. బిసి హోదా కావాలని, రిజర్వేషన్లలో భాగం కావాలని అటువైపు ముద్రగడ అమరావతిమీద జూలై 26 దండయాత్ర మొదలుపెడుతున్నాడు.కాపులు సై అంటున్నారు.సోషల్ మీడియాలో కాపు సెంటిమెంట్ ని ఇలాంటి పిలుపు (పక్కఫోటో)తో నలుమూలలా తీసుకువెళ్తున్నారు. మరొక వైపు నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పెద్ద చాలెంజ్ విసిరింది. నిన్నమొన్నటి వరకు అన్నా అంటు తిరిగిన శిల్పాయే అక్కడ టిడిపి అంతు చూస్తానని తిరుగబడ్డాడు. వీటిని ఎదుర్కొనే టెన్షన్ చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తుంది. నంద్యాల టెన్షన్ తప్పించుకునేందుకు అడిగినవి, అడగనివి కూడా ఇస్తానని హామీల వర్షం కురిపిస్తున్నాడు. ఇచ్చిన హామీలను పదే పదే గుర్తుచేస్తున్నందుకు కాపుల మీద పోలీసులను ఉసిగొల్పుతున్నాడు.
తూర్పు గోదావరి జిల్లాలో కాపు యాత్రను అణచేసేందుకు పెద్ద ఎత్తున పోలీసులను మొహరించారు. చివరకు అనంతపురం నుంచి ఇద్దరు డిఎస్ పిలను,ఇద్దరు ఆర్ ఐలను, ఆరుగురు సిఐలను, 25మంది ఎస్ ఐలను, 35 మంది హెడ్ కాన్ స్టేబుళ్లను, 7గురు మహిళా కాన్ స్టేబుళ్లను, 43 మంది హోం గార్డులను,80 మంది ఎఆర్ పోలీసులను, 24 మందేసి ఉన్న రెండు స్పెషల్ పార్టీ బృందాలను తూర్పుగోదావరికి తరలించారు.వీరంతా అమలాపురం బందోబస్తులో ఉంటారు. ఇదే విధంగా ఇతర జిల్లాలనుంచి కూడా పోలీసులను రప్పిస్తున్నారు.
విద్యార్థులను, యువకులను కౌన్సెలింగ్ పేరుతో బెదిరిస్తున్నారు. కోనసీమలోని 275 గ్రామాల్లో యువకులతో ముఖ్యంగా కాపు యువకులకు మైత్రీ సభలు నిర్వహించి పాదయాత్రలో పాల్గొనవద్దని కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎదురయ్యే కేసులను వివరించామన్నారు. కోనసీమ చాలామంది కాపు యువత విద్యార్థులు, విద్యావంతులేనని, పోలీసు కేసుల్లో అనవసరంగా ఇరుక్కుంటే ఉద్యోగాలు రావని చెబుతున్నారు. పిల్లలను అదుపు చేసుచేయాలని తల్లితండ్రులకు సలహా ఇచ్చారు. అమలాపురమే గొడవలకు కారణమని భావిస్తూ పెద్ద ఎత్తున అక్కడే కేంద్రీకరిస్తున్నారు. కాపు కౌంటర్ క్యాంపెయిన్ కు జిల్లా ఎస్ పి విశాల్ గున్నీ నాయకత్వం వహిస్తున్నారు.జిల్లాలో 144 సెక్షన్ , 30సెక్షన్ అమలులో ఉన్నాయని ఎక్కడా ముగ్గురు నలుగురు కలవడం మీద కూడ నిషేధం ఉంటుందని చెబుతున్నారు.
జిల్లా మొత్తం పికెట్లు ఏర్పాటుచేశారు. వచ్చిపోయే వారిని తని ఖీ చేస్తున్నారు. దీనిని ఎదిరిస్తే అరెస్టు చేయాలని అదేశాలిచ్చారు. 24 గంటలూ వొటి మీది కెమెరాలతో నిఘా వేసేందుకు ఆదేశాలిచ్చారు. ఎస్ పి గున్నీ ఏకంగా ముద్రగడ వూరు ఉద్యమ కేంద్రం కిర్లంపుడికి వచ్చి, ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆదేశాలిచ్చివెళ్లారు. ఇక అటూవైపు కాపులంతా పాదయాత్రలో పాల్గొనాలని, ఇది కాపులు అత్మగౌరవమని, కాపు జెఎసి పిలుపు నిచ్చింది.
తూర్పుగోదావరి జిల్లాను పోలీసులకు అప్పగించిన ముఖ్యమంత్రి నంద్యాల వ్యూహాన్ని తానే దగ్గిరుండి అమలుచేస్తున్నారు. ఇప్పటికే నంద్యాలను క్యాబినెట్ మంత్రులంతా సందర్శించారు. నంద్యాలను స్మార్ట్ సిటి చేస్తామన్నారు. రోడ్లు విశాలం చేసే పని రాత్రికి రాత్రి మొదలుపెట్టారు. లెట్రిన్ ల నిర్మాణాలకు డబ్బులిస్తున్నారు. ట్రాక్టర్లు, పాడిపశువులందిన్నారు. 800 కోట్ల రుపాయలతో ఎన్టీఆర్ కాలనీని కట్టిస్తానని హామీ ఇచ్చారు. నంద్యాలకు చెందిన ఇద్దరు ముస్లిం లీడర్లు, నౌమాన్, ఫరూక్ లకు పదవులిచ్చారు. జూన్ లో ఒక సారి నంద్యాల వెళ్లి వరాలెన్నో ప్రకటించారు. ఈ రోజు రెండో దఫా పర్యటించారు. ఈ మధ్య లో ముఖ్యమంత్రి కుమారుడు, ఐటి మంత్రి నారా లోకేశ్ కూడా వెళ్లి నంద్యాల ఎన్నికలను పర్యవేక్షించారు. దీనిని బట్టి నంద్యాల ఎన్నిక ముఖ్యమంత్రికి ఎంతటెన్షన్ సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు.