నంద్యాల బాధ్యత నుండి తప్పించినట్లేనా?

First Published Jun 17, 2017, 9:00 PM IST
Highlights

అఖిలపై బాధ్యత పెడితే లాభం లేదని సుబ్బారెడ్డి చెప్పారట. అందుకనే నంద్యాలకు ప్రత్యేకంగా మంత్రులు కాల్వ శ్రీనివాసులు, నారాయణకు అప్పగించారు. సామాజికవర్గం ఓట్లను సమీకరించటంతో పాటు ఆర్ధిక వనరుల కోసం  నారాయణకు చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. 

నంద్యాల ఉపఎన్నిక బాధ్యత నుండి మంత్రి అఖిలప్రియను తప్పించినట్లేనా? తన తండ్రి భూమా నాగిరెడ్డి మృతికారణంగా అనివార్యమైన నంద్యాల ఉప ఎన్నిక బాధ్యతను ప్రత్యేకంగా మరో ఇద్దరు మంత్రులకు అప్పగించారంటేనే పరిస్ధితి అర్ధమవుతోంది. అఖిలను నమ్ముకుంటే ఎన్నికలో గెలవలేమన్న విషయం చంద్రబాబుకు అర్ధమైపోయింది. అందుకనే హడావుడిగా మంత్రులు కాల్వ శ్రీనివాసులు, నారాయణకు అప్పగించారు.

 అంటే ఇకపై కాల్వ, నారాయణలు అదే పనిమీదుంటారు కాబోలు. ఎందుకంటే, నంద్యాల ఉపఎన్నికలో గెలవటమన్నది చంద్రబాబుకు లైఫ్ అండ్ డెత్ సమస్య అయిపోయింది. వాస్తవ పరిస్ధితులను చూస్తేనేమో గెలిచే అవకాశాలు లేదు. ఓడిపోతే పార్టీ, ప్రభుత్వం పరవు గంగలో కలిసిపోతుంది. అందుకనే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు.

దాని పర్యవసానమే ఈరోజు కర్నూలు జిల్లాలోని ఎంఎల్ఏలు, నేతలతో సమీక్ష. మంత్రి అఖిలప్రియ వ్యవహారశైలిపై పార్టీ నేతల్లో అసంతృప్తి మొదలైంది. అది బాహాటంగానే బటయపడింది కూడా. అసలే శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో చేరటంతో ఇబ్బంది పడుతున్న చంద్రబాబు అఖిలపై బయటపడిన అసంతృప్తులతో మైండ్ బ్లాంక్ అయింది. అందుకనే ఈరోజు అత్యవసర సమావేశం నిర్వహించారు.

అఖిలకు, భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఏవి సుబ్బారెడ్డికి పడటం లేదు. అందుకని ఇద్దరికీ సయోధ్య చేసారు. ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్ధి గెలుపుకు పనిచేసేలా సుబ్బారెడ్డిని చంద్రబాబు ఒప్పించారు. అదే సమయంలో అఖిలపై బాధ్యత పెడితే లాభం లేదని సుబ్బారెడ్డి చెప్పారట. అందుకనే నంద్యాలకు ప్రత్యేకంగా మంత్రులు కాల్వ శ్రీనివాసులు, నారాయణకు అప్పగించారు. సామాజికవర్గం ఓట్లను సమీకరించటంతో పాటు ఆర్ధిక వనరుల కోసం  నారాయణకు చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. వ్యవహారం చూస్తుంటే ఉప ఎన్నిక బాధ్యత నుండి అఖిలప్రియను చంద్రబాబు దాదాపు తప్పించినట్లే.

click me!