
నీరు మీరు పథకం పేరుతో చెరువుల పూడిక తీతకు ఏపీ ప్రభుత్వం భారీ స్థాయిలో చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. రైతుల పొలాలకు సాగు నీరందించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం చాలా గొప్పదని చెప్పొచ్చు. అయితే భానుడి దెబ్బకు బాబు పథకం బొల్తా పడింది.
గత కొన్ని రోజులుగా కృష్ణాజిల్లా కంచికచర్ల గ్రామంలోని కంచెలమ్మ చెరువులో ఉన్న చేపలన్నీ చనిపోతున్నాయి. చెరువులో ఉంటేనే కదా చేపలు బతికేది అలాంటిది చెరువులో చేపలు చనిపోవడం ఏంటీ... దానికి బాబుగారి నీరు మీరు పథకంతో లింకేంటి అని అనుకుంటున్నారా..
నీరు మీరు పథకంలో భాగంగా చెరువుల పూడికతీత చేపట్టడంతో కంచెలమ్మ చెరువులో నీళ్లు బాగా చేరాయి. దీంతో చేపలు కూడా భారీగా వచ్చిపడ్డాయి. అయితే ఎండకాలం సమీపించడంతో స్థానిక రైతులు చెరువులోని నీళ్లను తమ పొలాలకు మళ్లించుకపోయారు.
ఒక వైపు తీవ్రమైన ఎండలు, మరో వైపు జలకళతో నిండిన చెరువులో ఒక్కసారిగా నీళ్లు ఖాళీ అవడంతో అందులో చేపలన్నీ భానుడి దెబ్బకు ప్రాణం వదిలేశాయి. చెరువు నుంచి కిలోమీటర్ పరిధి వరకు చచ్చిపోయిన చేపల కంపుతో దుర్గంధం వ్యాపించింది.
దీంతో సమీపంలోని ప్రజలు నానా అవస్థ పడుతున్నారు. సంబంధిత అధికారులకు ఈ విషయంపై ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఏలాంటి చర్యలు చేపట్టలేదు.