
శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం అందరికీ తెలిసిందే. ఇచ్చాపురం పక్కనే ఎవరికీ తెలియని చిన్న వూరుంది. ఆవూరి పేరు పురుషోత్తపురం.మామూలుగా అయితే, ఈ వూరి గురించి చెప్పుకునేందుకేమీ లేదు. సాదాసీదా వూరు. అయితే, 2017 జూన్ 1 అర్థరాత్రి ఈ వూరొక వార్త అయింది.కారణం. జిఎస్ టి అమలులోకి రావడంతో ఈ వూర్లో ఉన్న భారీ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టు మూత పడుతూఉంది. ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి దాకా అంటే దాదాపు 30 సంవత్సరాల పాటు ఈ వూరిని పోషించింది ఈచెక్ పోస్టే. అధికారులకు కోట్లిచ్చినా, ఈ వూరి ప్రజలకు మూడుపూటలా భోజనం పెట్టింది ఈ చెక్ పోస్టే... జిఎస్ టి రావడం, చెక్ పోస్ట్ మూతపడటంతో ఈ వూరికిపుడు జీవనాధారం పోయింది. ఆ చింత వూరంతా కనిపిస్తుంది.
ఈ ఇంటెగ్రేటెడ్ చెక్ పోస్టులో 500 మంది దాకా ఉద్యోగులుంటే, దీనిమీద ఆదార పడి జీవనం సాగిస్తున్నావారు నాలుగయిదు వేల మంది ఉంటారు. చెక్ పోస్టు ఉన్న పురుషోత్తపురానికి ప్రధాన జీవనాధారం చెక్ పోస్టే అయింది. చెక్ పోస్టు నమ్ముకుని టీషాపులు, టిఫిన్ సెంటర్లు, ఫోటో కాపియింగ్ షాపులు, పాన్ షాపులు, కిరాణ షాపులు, హోటళ్లు ... ఇలా ఎన్నో రకాల షాపులతో ఈ ప్రాంతం 24 గంటలు రద్దీ గా ఉంటుంది.దీనికి కారణం, ఈ చెక్ పోస్టు గుండా రోజు కనీసం 4 వేల వాహనాలు వెళ్తుంటాయి.పశ్చిమబెంగాల్, ఒదిశా, నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చేవి, కేరళ, కర్నాటక,తమిళనాడు, పాండిచ్ఛేరి రాష్ట్రాలకు సరుకులు తీసుకువెళ్లే వాహనాలు ఈ చెక్ పోస్టే మార్గం. అన్ని సరిగ్గా ఉన్నా వాహనం ఆంధ్రలో ప్రవేశించాలంటే అడిగినంత డబ్బివ్వాలి. సరుకునబట్టి రేట్ పిక్స్ చేస్తారు. ఇక్కడి పోస్టింగ్ వేయించుకోవడానికి కూడా అధికారులు పెద్ద ఎత్తున ఖర్చచేసేవారు. పైరవీ కూడా పెద్ద స్థాయిలోనే ఉండాలి.
ఈ ఇంటెగ్రేటెడ్ చెక్ పోస్టును1988 జనవరి 30న అప్పటి రాష్ట్ర వాణిజ్య పన్నలు శాఖ మంత్రి కళావెంకటరావు ప్రారంభించారు. ఇందలో వాణిజ్య పన్నుల శాఖ చెక్ పోస్టుతోపాటు మోటార్ వెహికిల్ తనిఖీ విభాగం, వ్యవసాయ,సివిల్ సప్లయిస్, ఫారెస్టు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ వంటి శాఖ చెక్ పోస్టులున్నాయి. ఈవిభాగాలనుంచి ప్రభుత్వానికి దాదాపు ఏటా 5 కోట్ల రాబడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే, సిబ్బందికి అయ్యే వసూళ్లు ఇంతకంటే వందరెట్లు ఎక్కువగా ఉంటాయని అందిరికీతెలుసు. ఈ చెక్ పోస్ట్ అంటే అవినీతి. సిబ్బందికి కోట్లు వసూలు చేసిన పెట్టిన ఉమ్మడి ఆంధ్రలోని ముఖ్యమయిన చెక్ పోస్టులలో ఇది నెంబర్ వన్ అంటారు.అవినీతి ఇంత భారీగా పారుతుంది కాబట్టే పురుషోత్తపురం చెక్ పోస్టు మీద అవినీతి నిరోధక శాఖ దాడులెక్కువ. ఏడాదికి కనీసం నాలుగుయిదుసార్లు దాడులు జరుగడం, కట్టలు కట్టలు నోట్లు దొరకడం ఆనవాయితి.
ఇపుడు ఈ అవినీతి అధికారుల నోట్లో జిఎస్టి దుమ్ముకొడుతున్నది. జిఎస్టి రావడంతో ఈ చెక్ పోస్టును మూసేస్తున్నారు. ఈ రోజు అధికారులు, ఈ అధికారులను ఇక్కడికి పోస్టింగ్ ఇప్పించిన రాజకీయ నాయకులనుంచి ఈ ఆర్థరాత్రి ఈ అక్షయ పాత్ర జారిపోయింది. ఈ అక్షయ పాత్ర నుంచి అధికారులకు దొరికిన అక్రమ వసూళ్లు చూస్తే కళ్లు తిరిగిపోతాయి. 2013 డిసెంబర్ 22న రు. 2.15 లక్షలు, 27న రు.1.20లక్షలు. 2014 మార్చిలో రు. 1.02 లక్షలు... కొన్ని ఉదాహరణలు.
చెక్ పోస్టు ఎత్తి వేస్తుండటంతో ఇక్కడున్నఅధికారులలో చాలా మంది భారంగా ఇతర శాఖల్లోకి వెళ్లా ల్సి వస్తుంది. అక్కడ జీవితం ఇంతా లాభసాటిగా ఉండకపోవచ్చు.
వీళ్లంతా బాగా వెనకేసుకన్నవాళ్లే... అయితే, ఈ చెక్ పోస్టునమ్ముకుని ఇంత కాలం బతుకుబండి లాగుతూవచ్చిన చిరు వ్యాపారలకు బతుకే బుగ్గిపాలవుతున్నది.