అత్తారింటి ఎదుట మహిళ ధర్నా

First Published Dec 1, 2017, 11:08 AM IST
Highlights
  • అదనపు కట్నం కోసం భర్త వేధింపులు
  • ఆడపిల్ల పుట్టిందని మహిళను ఇంటి నుంచి గెంటేసిన భర్త, అత్తమామలు

తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ అత్తారింటి ఎదుట ధర్నా చేపట్టిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం వెదుళ్లకుంటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉంగుటూరు మండలం యల్లమిల్లి గ్రామానికి చెందిన యాగంటి శివరామకృష్ణ, కనకదుర్గల కుమార్తె శ్రీదేవిని గోపాలపురం మండలం వెదుళ్లకుంట గ్రామానికి చెందిన జొన్నలగడ్డ వెంకటేశ్వరరావు పెద్ద కుమారుడు మోహనకృష్ణకు ఇచ్చి 2015 మేలో వివాహం చేశారు. అప్పట్లో కట్నం కింద రూ 15 లక్షలు, 70 కాసులు బంగారం ఇచ్చారు.

 పెళ్లి అయిన తరువాత కొంతకాలం బెంగళూరులో కాపురం పెట్టారు. ఆ తరువాత వారికి ఓ పాప పుట్టింది. శ్రీదేవి కట్నం రూపంలో తీసుకువచ్చిన 70కాసుల బంగారాన్ని బ్యాంకుల్లో తనిఖీ పెట్టాడు. పెళ్లికి ముందు మోహన్‌కృష్ణ బెంగళూరులో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడని, అతని పేరుమీద 23 ఎకరాల పొలం ఉందని అతని తల్లిదండ్రులు చెప్పారని, కాని విచారిస్తే ఏ ఉద్యోగం లేదని తేలిందని శ్రీదేవి వాపోయింది. తీసుకెళ్లిన నగదు, నగలు అయిపోవడంతో  శ్రీదేవి పేరుమీద ఉన్న ఎకరం పొలం అమ్ముకుని రావాలంటూ భర్త, అత్తమామలు, ఆడపడుచు, మరిది వేధిస్తున్నారని తెలిపింది. దీనిపై ఉంగుటూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో మహిళా సంఘాలను ఆశ్రయించినట్లు తెలిపింది. కోడలు శ్రీదేవి మనుమరాలితో గోపాలపురం వచ్చిందని తెలుసుకున్న శ్రీదేవి అత్తమామలు ఇంటి నుంచి పరారైనట్లు తెలిపింది. 

click me!