
దేశంలోని కోట్లాది ముస్లిం మహిళల మనోభావాలను న్యాయస్ధానం పరిగణలోకి తీసుకుంది. ఇష్టంలేని భార్యలను వదిలించుకునేందుకు ముస్లిం పురుషులకు దశాబ్దాల తరబడి అండగా నిలిచిన త్రిబుల్ ‘తలాక్’ ఇక ఎంతమాత్రం చెల్లదు. ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆమోదించిన త్రిబుల్ తలాక్ చెల్లదంటూ అలహాబాద్ హై కోర్టు తాజాగా తీర్పు చెప్పింది. దాంతో కోట్లాది మంది మహిళలకు పెద్ద ఊరట.
త్రిబుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్ధానం చెప్పింది. ఆమోదయోగ్యం కాని తలాక్ ను ఎవ్వరూ ఆచరించాల్సిన అవసరం లేదని హై కోర్టు చెప్పింది. రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తిగత హక్కులను ఏ బోర్డు కూడా హరించలేందని స్పష్టం చేసింది. కేవలం నోటి మాట ద్వారా భార్యలకు విడాకులు ఇవ్వటాన్ని కోర్టు తప్పుపట్టింది.
ఇష్టంలేని భార్యలను వదిలించుకునేందుకు ఇంతకాలం పురుషులకు త్రిబుల్ తలాక్ పెద్ద ఆయుధం. ఈ ఆయుధాన్ని అడ్డం పెట్టుకుని ఎందరో పురుషులు తమ భార్యలకు చాలా తేలిగ్గా విడాకులు ఇస్తున్నారు. ఈ పద్దతిని ఎందరు మహిళలు, స్వచ్చంధ సంస్ధలు ఎంత వ్యతిరేకించినా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏమాత్రం ఖాతరు చేయలేదు.
దాంతో త్రిబుల్ తలాక్ ను వ్యతిరేకిస్తూ పలువురు మహిళలు న్యాయస్ధానాన్రి ఆశ్రయించారు. దానికిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన అలహాబాద్ హై కోర్టు ముస్లిం మహిళల మనోభావాలను పరిగణలోకి తీసుకుంది. విడాకుల విషయంలో ముస్లిం పర్సనల్ లా బోర్డ్ విధానం చెల్లదని స్పష్టం చేసింది. ఏ పర్సనల్ లా బోర్డయినా దేశంలోని రాజ్యాంగానికి లోబడే పనిచేయాలని విస్పష్టంగా ప్రకటించింది.
ఇదిలావుండగా, త్రిబుల్ తలాక్ విషయంలో న్యాయస్ధానం జోక్యం చేసుకోవటాన్ని పలువురు మత పెద్దలు అభ్యంతరం చెబుతున్నారు. తమ పర్సనల్ లా బోర్డు ప్రకారం తలాక్ సమ్మతమేనని కాబట్టి న్యాయస్ధానం జోక్యాన్ని సహించేది లేదని చెబుతున్నారు.