
తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ఢిల్లీకి వెళుతున్నారు. మంగళ, బుధ వారాల్లో ప్రధానమంత్రి, రాష్ట్రపతితో పాటు పలువురు కేంద్రమంత్రులను కలుస్తారని సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిప్థితులను ప్రధాని, రాష్ట్రపతికి వివరించనున్నారు. పనిలో పనిగా తన పదవీకాలం విషయమై కూడా పెద్దల నుండి ఓ స్పష్టత రాబట్టే ప్రయత్నం కూడా చేయవచ్చు. రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్న తరుణంలో గవర్నర్ రెండు రోజుల పాటు అంటే మంగళ, బుధవారాల్లో ఢిల్లీలో మకాం వేయనుండటం గమనార్హం.
విభజన చట్టం అమలుపై చర్చించేందుకు హోంశాఖ మంత్రితో కూడా భేటీ అవుతున్నారు. రాష్ట్రాలు విడిపోయి మూడేళ్లవుతున్నా ఇంకా అనేక సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. హైదరాబాద్ లోని ఏపి సచివాలయం భవనాలను తెలంగాణా ప్రభుత్వ కావాలంటోంది. దాంతో పాటు హైదరాబాద్ లోనే కేంద్రీకృతమైన అనేక కేంద్రప్రభుత్వ సంస్ధలు, కార్యాలయాల విభజన పంచాయితీపై కూడా హోం మంత్రితో చర్చించనున్నారు. తిరిగి వచ్చిన వెంటనే రాజ్ భవన్ లోని సిబ్బందిని ప్రక్షాళన చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఒఎస్డీతో పాటు సిబ్బందిలోని కొందరిపై ఫిర్యాదులు అందుతున్న కారణంగా ప్రక్షాళన అవసరమని నరసింహన్ భావిస్తున్నట్లు తెలిసింది.