జయ మృతిపై విచారణ

First Published Dec 9, 2016, 8:45 AM IST
Highlights

జయ మరణంపై అనేక అనుమానాలున్నాయని వాటిని నివృత్తి చేయించాల్సిన బాధ్యత ఉందంటూ ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడికే లేఖ రాయటం సంచలనంగా మారింది.

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి పట్ల విచారణ చేయించాలనే డిమండ్లు మొదలయ్యాయి. జయ మృతి పట్ల కోట్లాదిమందికి అనేక అనుమానాలున్నాయి. సమయం, సందర్భం కాదన్న ఉద్దేశ్యంతో సందేహాలున్నవారెవరూ నోరు మెదపటం లేదు. అయితే, సినీనటి గౌతమి మాత్రం తనకున్న అనుమానాలను బహిరంగంగా లేవనెత్తారు.

 

జయ మరణించిన నాలుగు రోజుల తర్వాత గౌతమి కోట్లాది మంది అమ్మ అభిమానుల తరపున తనకున్న అనుమానాలను ఓ లేఖ రూపంలో బహిర్గత

పరిచారు. జయ మరణంపై అనేక అనుమానాలున్నాయని వాటిని నివృత్తి చేయించాల్సిన బాధ్యత ఉందంటూ ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడికే లేఖ రాయటం సంచలనంగా మారింది.

 

తన లేఖలో ప్రధానంగా గౌతమి నాలుగు సందేహాలను లేవనెత్తారు. జయ ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఎందుకు అన్ని రోజులు చికిత్స, అనారోగ్యంపై గోప్యత పాటించారు? ఏ అధికారంతో ఆమ్మను ఎవరినీ కలవకుండా ఆంక్షలు విధించారు? ఆంక్షలను ఎవరు విధించారు?

 

జయ చికిత్సకు సంబంధించి నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు? ఇటువంటి ప్రశ్నలకు ఎవరు సమాధానం ఇస్తారని ఆమె ప్రశ్నించారు. కోట్లాది మందికి ఉన్న అనేక ప్రశ్నలకు సమాధానాలు లభించాలంటే వెంటనే తగిన విచారణ జరిపించాలని ప్రధానమంత్రికి లేఖ రాసారు.

 

జయలలిత మరణించే నాటికే 75 రోజులుగా చికిత్స నిమ్మితం ఆసుపత్రిలో ఉన్నారు. అయితే, అప్పటి నుండి జయ అనారోగ్యంపైన గాని, చేస్తున్న చికిత్సపైన గాని ఎవరికీ ఎటువంటి సమాచారం లేదు. అనారోగ్యం నుండి కోలుకుంటున్నారని ప్రకటించిన ఆసుపత్రి యాజమాన్యం జయ ఎప్పుడు కోరుకుంటే అప్పుడు డిస్చార్జ్ కూడా చేస్తామన్నారు.

 

అయితే హటాత్తుగా జయకు గుండెపోటు వచ్చిందని మొన్నటి 4వ తేదీన ఆసుపత్రి ప్రకటించటంతో అందరూ దిగ్భ్రాంతిచెందారు. ఈ నేపధ్యంలోనే జయ అనారోగ్యంపై అనేకమందికి అనేక సందేహాలు ఉన్నాయి. ఇంతలో జయ మరణించినట్లు యాజమాన్యం 5వ తేదీ రాత్రి ప్రకటించింది.

 

చికిత్స పొందుతున్న జయను పరామర్శించటానికి ఎవ్వరినీ అనుమతించలేదు. కనీసం ఇన్చార్జ్ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను కూడా అనుమతించకపోవటం గమనార్హం. ఇటువంటి నేపధ్యంలోనే కోట్లాదిమందికి జయ మరణంపట్ల సందేహాలు మొదలయ్యాయి. దానికి మద్దతుగా అన్నట్లు నటి గౌతమి రాసిన లేఖకు అనూహ్యంగా ప్రజల నుండి మద్దతు లభిస్తోంది.

click me!