నాన్నతో కలిసి ఓటేద్దామని అనుకున్నా, ప్చ్..: గాలి కూతురు బ్రాహ్మణి

First Published May 12, 2018, 3:20 PM IST
Highlights

మైనింగ్ దిగ్గజం, బిజెపి కీలక నేత గాలి జనార్దన్ రెడ్డి శనివారం తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. 

బళ్లారి: మైనింగ్ దిగ్గజం, బిజెపి కీలక నేత గాలి జనార్దన్ రెడ్డి శనివారం తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. అక్రమ మైనింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయన ప్రస్తుతం బెయిల్ పై బయటే ఉన్నారు. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో గాలి జనార్దన్ రెడ్డి సోదరులిద్దరు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే, తన స్వస్థలం బళ్లారికి ఆయన సుప్రీంకోర్టు ఆదేశాల కారణంగా వెళ్లలేకపోయారు. బళ్లారికి వెళ్లకూడదంటూ సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. బళ్లారిలో ప్రచారం చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ గాలి జనార్దన్ రెడ్డి చేసుకున్న విజ్ఢప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఓటు వేసేందుకు ఆయన కోర్టు అనుమతి కోరారా, లేదా అనేది తెలియదు.

కాగా, గాలి జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులు శనివారం  తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన తర్వాత గాలి జనార్దన్ రెడ్డి కూతురు బ్రాహ్మణి మీడియాతో మాట్లాడారు. తొలిసారి తాను ఓటేస్తున్నానని, వాస్తవానికి తాను నాన్నతో కలిసి తొలిసారిగా ఓటు వేయాలని అనుకున్నానని, కానీ కుదరలేదని అన్నారు. 

కోర్టు తీర్పును ఆయన గౌరవించారని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. 

click me!