
మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి మళ్లీ కష్టాల్లో పడ్డాడు. పెద్ద నోట్లు రద్దై సామాన్యులంతా రోజు గడవడానికే నానా కష్టాలు పడుతుంటే ఈ గనలు ఘనుడు మాత్రం తన కూతురు పెళ్లిని అంగరంగ వైభవంగా నిర్వహించిన విషయం తెలిసిందే.
దీంతో ఈ పెళ్లిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఐటీ అధికారులు ఏదో తూతూ మంత్రంగా గాలి ఇంట్లో సోదాలు నిర్వహించే అంతా బాగుందనే చెప్పారు.
గాలి జనార్దన్ రెడ్డి కూడా పెద్ద నోట్ల రద్దుకు ముందే ఈ పెళ్లికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈవెంట్ మేనేజ్ మెంట్ కు అప్పగించామని వివరణ ఇచ్చారు. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది.
అయితే ఇప్పుడు అనుకోకుండా ఓ ప్రభుత్వ అధికారి డ్రైవర్ ఆత్మహత్యతో గాలి బాగోతం బయట పడింది. తన కూతరు పెళ్లి కోసం గాలి ... రూ. 100 కోట్ల బ్లాక్ మనీ ని వైట్ గా మార్చారని, దీనికి సంబంధించి భీమా నాయక్ అనే భూసేకరణ అధికారి సహాయ పడ్డారని తెలుస్తోంది.
భీమా నాయక్ డ్రైవర్ గా పనిచేసిన రమేష్ గౌడ్ అనే వ్యక్తి ఆత్మహత్య కు ముందు రాసిన లేఖలో ఈ విషయాలు వెలుగు చూశాయి.
గాలి జనార్దన్ రెడ్డి రూ.100 కోట్లకు పైగా నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారని, దానికి సంబంధించిన సమాచారం తనకు తెలిసినందువల్ల తనను చంపుతామంటూ నిరంతరం బెదిరిస్తున్నారని రమేష్ ఈ లేఖలో ఆరోపించారు.
గాలి జనార్దన్‌రెడ్డి కుమార్తె వివాహం కోసం అత్యధిక మొత్తంలో డబ్బు అవసరం కావడంతో, ఆయన వద్ద ఉన్న సొమ్మును కొత్త కరెన్సీలోకి మార్చేందుకు భీమా నాయక్ 20 శాతం కమీషన్ తీసుకున్నారని రమేష్ పేర్కొన్నారు.
ముందే హెచ్చరించిన ఇ ఎ ఎస్ శర్మ
కాగా, కేంద్ర ప్రభుత్వ మాజీ ఫైనాన్స్ సెక్రెటరీ ఇ ఎ ఎస్ శర్మ ఈ అంశంపై ముందే కేంద్రాన్ని హెచ్చరించారు. గాలి కూతరు వివాహం అత్యంత ఆడంబరంగా నిర్వహించిన నేపథ్యంలో దీనిపై దర్యాప్తు జరపాలని శర్మ కేంద్రప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. నల్ల ధనం మార్చుకునేందుకు గాలి ప్రయత్నిస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. రమేష్ గౌడ్ ఆత్మహత్య నేపథ్యంలో శర్మ మరోసారి ప్రభుత్వానికి లేఖ రాశారు. గాలిఅక్రమాలపై ఐటీ అధికారులతో విచారణ జరపాలని కేంద్రానికి రాసిన లేఖ లో సూచించారు.