గజల్ శ్రీనివాస్ కి బెయిల్

First Published Jan 24, 2018, 2:53 PM IST
Highlights
  • గజల్ కి షరతులతో కూడిన బెయిల్ మంజూరు
  • ఏ2 పార్వతికి ముందస్తు బెయిలు మంజూరు

లైంగిక వేదింపుల కేసులో అరెస్టు అయిన ప్రముఖ గాయకుడు, గజల్ కళాకారుడు శ్రీనివాస్ కి నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అదేవిధంగా శ్రీనివాస్ పీఏ, ఈ కేసులో ఏ2 నిందితురాలైన పార్వతికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కాకపోతే.. ప్రతి బుధ, ఆదివారాల్లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో హాజరుకావాలని ఆదేశించింది. తన దగ్గర పనిచేసే యువతిని లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో గజల్ ని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. అప్పటి నుంచి ఆయన పోలీసుల రిమాండ్ లో ఉన్నారు.

రిమాండ్‌లో ఉన్న గజల్‌కు బెయిల్‌ మంజూరు చేయాలంటూ ఆయన తరఫు న్యాయవాది వేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. గజల్‌కు బెయిల్‌ ఇవ్వవద్దంటూ పంజాగుట్ట పోలీసులు కౌంటర్‌ వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ కేసులో ఇంకా చాలామందిని విచారించాల్సి ఉందని, ఇప్పట్లో బెయిల్‌ దొరికితే సాక్ష్యాలు తారుమారు అవుతాయని పోలీసుల తరఫు న్యాయవాది వాదించారు. ఈ కేసులో రెండో నిందితురాలిగా ఉన్న పార్వతిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదంటూ కోర్టు పోలీసులను ప్రశ్నించింది. పరారీలో ఉన్నందున ఆమెను అరెస్టు చేయలేదని పోలీసుల తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. మరోవైపు పార్వతి కూడా ముందస్తు బెయిల్‌ కోసం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. గజల్‌ బెయిల్‌తోపాటు పార్వతి ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై విచారణ జరిగిన అనంతరం కోర్టు ఈ మేరకు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

click me!