జర్నలిస్టు డే హత్య కేసులో ఛోటా రాజన్ కు జీవిత ఖైదు

First Published May 2, 2018, 3:16 PM IST
Highlights

జర్నలిస్టు జ్యోతిర్మయి డే హత్య కేసులో మహారాష్ట్ర మోకా కోర్టు ఛోటా రాజన్ ను దోషిగా తేల్చింది.

ముంబై: జర్నలిస్టు జ్యోతిర్మయి డే హత్య కేసులో మహారాష్ట్ర మోకా కోర్టు ఛోటా రాజన్ ను దోషిగా తేల్చింది. ముంబై శివారులో ఏడేళ్ల క్రితం హత్యకు గురైన డే కేసులో కోర్టు బుధవారంనాడు తీర్పు వెలువరించింది.  ఛోటా రాజన్ కు జీవిత ఖైదు విధించింది. 

కాగా, మాజీ జర్నలిస్టు జిగ్నా వొరాను, మరో నిందితుడు జోసెఫ్ పాల్సేన్ ను నిర్దోషులుగా ప్రకటించింది. క్రైమ్ జర్నలిస్టు డే (56) 2011 జూన్ 11వ తేదీన హత్యకు గురయ్యాడు. పొవాయిలోని తన ఇంటికి వెళ్తుండగా అతనిపై కాల్పులు జరిగాయి.

మరో జర్నలిస్టు ప్రేరణతో గ్యాంగస్టర్ ఛోటా రాజన్ ఆదేశాల మేరకు డదేను కాల్చి చంపినట్లు ప్రాసిక్యూషన్ వాదించింది. ఈ కేసులో కోర్టు 11 మందిని విచారించింది. 

అతని తల్లి ఇంటి నుంచి డేను ఛోటా రాజన్ మనుషులు సతీష్ కాల్యా, అనిల్ వాఘ్మోడ్, అభిజీత్ షిండే, నీలేష్ సింఘ్డే, అరుణ్ డాకే, మంగేష్ అగవానే, సచిన్ గైక్వాడ్ వెంబడించారని ప్రాసిక్యూషన్ న్యాయవాది వాదించారు. 

కాల్యా డేపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత ముఠా పారిపోయింది. డే 20 మంది గ్యాంగస్టర్స్ పై చిండి .. రాగ్స్ టు రిచెస్ పేరుతో పుస్తకం రాయడానికి సిద్ధపడ్డాడు. ఛోటా రాజన్ గురించి కూడా అందులో రాయాలని అనుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఛోటా రాజన్ అతని హత్యకు పథకరచన చేసినట్లు చెబుతున్నారు. 

రాజన్ ను 2015లో అరెస్టు చేసిన తర్వాత సిబిఐ దర్యాప్తు చేపట్టింది. డేను తనపై రాయకుండా చేయడానికి ఛోటా రాజన్ 2011 జనవరి, మార్చి మధ్య పలుమార్లు ప్రయత్నించినట్లు చెబుతున్నారు.

ఇండోనేషియాలోని బాలి నుంచి 2015 నవంబర్ లో భారతదేశానికి రప్పించిన తర్వాత ఈ కేసులో ఛోటా రాజన్ ను నిందితుడిగా చేర్చారు. ప్రస్తుతం అతను ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నాడు.

click me!