రూ.10కోట్లు హారతి చేసేశారు..

First Published Nov 22, 2017, 1:40 PM IST
Highlights
  • రాష్ట్రవ్యాప్తంగా జలసిరికి హారతి కార్యక్రమం చేపట్టిన చంద్రబాబు
  • మూడు రోజులపాటు సాగిన జలసిరికి హారతి
  • ప్రచారానికి రూ.కోట్లు ఖర్చుపెట్టిన చంద్రబాబు ప్రభుత్వం

‘ జలసిరికి హారతి’.. కొద్ది రోజులపాటు.. ఈ పేరు ఆంధ్రప్రదేశ్ లో మార్మోగిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ఇది. రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా ఈ కార్యక్రమం చేపట్టిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అన్ని న్యూస్‌ ఛానళ్ళలో 'జలసిరికి హారతి' అంటూ పెద్దయెత్తున యాడ్స్‌ దర్శనమిచ్చాయి. అయితే.. ఈ యాడ్స్ కోసం ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిందో తెలుసా? అక్షరాలా రూ.10కోట్లు.

  ఈ జలసిరి హారతి వల్ల ప్రజలకు ఒరిగింది ఏమైనా ఉందా? అంటే.. శూన్యం. కేవలం తమ ప్రభుత్వానికి పబ్లిసిటీ ఇవ్వడానికి తప్ప మరే ఉపయోగం లేదు. కానీ.. పత్రికలకు మాత్రం యాడ్స్ రూపంలో కోట్లు దోచిపెడుతున్నారు. మూడురోజుల జలసిరి తంతు కోసం.. ‘ఈనాడు’ పత్రికకు రూ.2కోట్లు 44లక్షలు సమర్పించుకున్నారు. ఇక మరో పత్రిక ‘ ఆంధ్రజ్యోతి’ కి రూ.కోటి 94లక్షలు అంటే దాదాపు రూ.2కోట్లు అందజేశారు. మరో పత్రిక సాక్షి కి రూ.63లక్షలు, ఆంధ్రప్రభకి రూ. 94లక్షలు ఇచ్చారు.

సరే.. ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం చేపడితే.. న్యూస్ పేపర్లకు యాడ్స్ ఇవ్వడం సర్వసాధారణం. ప్రముఖ పత్రికలు కాబట్టి.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, సాక్షి లాంటి వాటికి ప్రకటలు ఇచ్చారంటే సబబుగానే ఉంటుంది. కానీ.. ఎలాంటి ప్రజాధరణ లేని, చాలా మంది ఎప్పుడూ పేరు కూడా వినని ‘‘నేటి దిన పత్రిక సూర్య’’ అనే పత్రికకు ఈ జలసిరి ప్రకటన నిమిత్తం రూ.1కోటి అందజేశారు. మొత్తం తెలుగు, ఆంగ్ల పత్రికలు కలుపుకొని.. ‘‘జలసిరి హారతి’’ కార్యక్రమ ప్రకటనలకు చంద్రబాబు ప్రభుత్వం రూ.10కోట్లు ఖర్చు చేసింది.

ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో చంద్రబాబు మాట్లాడింది ఏంటయ్యా అంటే.. రాష్ట్ర అభివృద్ధిని జగన్ అడ్డుకుంటున్నారని. ప్రతిపక్షాన్ని తిట్టడానికే జలసిరి కార్యక్రమం చేపట్టినట్టు వ్యవహరించారు. సరే ఈ విషయం పక్కనపెడితే.. మొన్నటికి మొన్న కృష్ణా నదిలో పడవ బోల్తాపడి 22మంది చనిపోయిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ జలసిరి హారతి కార్యక్రమాన్ని చూడటానికి వెళ్లే పాపం వాళ్లంతా మృత్యువాత పడింది. రాష్ట్రంలో వర్షాలు పడితే.. తన సంకల్పం వల్లే పడ్డాయని చెప్పుకునే చంద్రబాబు.. 22మంది ప్రాణాలు పోవడానికి కారణం అడిగితే మాత్రం నోరు మెదపడం లేదు. ఏది ఏమైనా.. రాష్ట్ర ఆదాయాన్ని.. పత్రికలకు దోచిపెడుతున్నారంటూ చంద్రబాబు పై ఆరోపణలకు ఈ జలసిరి ప్రకటనలు మరింత బలం చేకూర్చాయి. చంద్రబాబు రాష్ట్ర ఖజానాని ఎలా దుబారా చేస్తున్నారో చెప్పడానికి ఇదొక మచ్చుతునక మాత్రమే.

click me!