
జగన్ పాదయాత్రకు భంగం కలిగించేలా కుట్ర జరగుతోందా? వైసీపీ నేతల మాటలు వింటుంటే నిజమనే అనిపిస్తోంది. ఈనెల 6వ తేదీ నుంచి జగన్ ‘ ప్రజా సంకల్ప యాత్ర’ పేరుట పాదయాత్ర మొదలౌతున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ యాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ప్రతిపక్ష నేతగా జనాల్లోకి వెళ్లే హక్కు జగన్ కి ఉందని ధర్మాన అన్నారు. ప్రజలను చైతన్య పరిచే బాధ్యత ప్రతిపక్ష నేతలపై ఉందని చెప్పారు. పాదయాత్రను అడ్డుకోవాలనుకోవడం దుర్మార్గమన్నారు. సీఎం చంద్రబాబు స్థాయి మరిచి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. విపక్ష సభ్యులు మంత్రులుగా ఉన్న ఏకైక ప్రభుత్వం చంద్రబాబుదేనని దుయ్యబట్టారు.
చంద్రబాబు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ఇప్పటివరకు 2 వేల రహస్య జీవోలు విడుదల చేసిందని తెలిపారు. రాజ్యాంగ ఉల్లంఘనలతో వ్యవస్థలను చంద్రబాబు భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. శాసనసభలో మాట్లాడనీయకుండా ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారని, ఇలాంటి సందర్భంలో ప్రజలను జాగృతం చేయాల్సిన బాధ్యత విపక్షానిదేనని అన్నారు. 6 నెలలు జరిగే పాదయాత్రలో ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని, అక్రమాలను, చట్టవ్యతిరేక చర్యలను ప్రజలకు జగన్ వివరిస్తారని చెప్పారు. జననేత అందరినీ కలుస్తారని, పాదయాత్రకు అందరూ సహకరించాలని ధర్మాన ప్రసాదరావు కోరారు.