
నగదు విత్ డ్రాపై డిసెంబర్ 30వ తేదీ తర్వాత కూడా ఆంక్షలు కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే, ఖాతాదారులకు అడిగినంత డబ్బు ఇవ్వటానికి ఏ బ్యాంకులోనూ సరిపడా డబ్బు లేదు. ఈ నేపధ్యంలో డిసెంబర్ 30 వ తేదీ తర్వాత దేశ ప్రజలు నవభారతాన్ని చూస్తారంటూ ప్రధాని గతంలోనే ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది.
అయితే, ప్రధాని చెప్పినప్పటి నుండి ఇనాటికి కూడా కరెన్సీ సంక్షోభంలో యావత్ దేశం కొట్టుమిట్టాడుతోంది. పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్ధిక వ్యవస్ధే కుదేలైపోయింది. ఇటువంటి సమయంలో ప్రధాని చెప్పినట్లుగా ఏమైనా అద్భుతం జరుగుతుందా అని అందరూ డిసెంబర్ 30వ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు.
అదే సమయంలో నగదు పరిమితిపై కేంద్రం ఆంక్షలు ఎత్తేసే అవకాశాలున్నట్లు ప్రచారం మొదలైంది. దాంతో బ్యాంకులు అప్రమత్తమైనట్లు సమాచారం. డిసెంబర్ 30 తర్వాత నగదు విత్ డ్రాపై ఆంక్షలను ఎట్టి పరిస్ధితుల్లోనూ ఎత్తేయవద్దని కేంద్రంపై బ్యాంకులు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అంటే ఆంక్షలను మరికొంత కాలం కొనసాగించాల్సిందిగా కేంద్ర ఆర్ధికశాఖను కోరుతున్నాయి.
ఖాతాదారులు అడిగినంత డబ్బులను ఇవ్వటానికి బ్యాంకులకు ఇంకా చాలా కాలం పడుతుంది. కేంద్రం ఆంక్షలున్న సమయంలోనే దేశంలోని పలు చోట్ల బ్యాంకులపై ఖాతాదారులు దాడులు చేసారు. అటువంటిది బ్యాంకులకు సరిపడా డబ్బు నిల్వలు ఇవ్వకుండా డబ్బు విత్ డ్రాపై ఆంక్షలను ఎత్తేస్తే పరిస్ధితి దారుణంగా తయారౌతుందని బ్యాంకులు ఆందోళన చెందుతున్నాయి.
అదే విషయాన్ని కేంద్రానికి స్పష్టం చేసాయి. బ్యాంకుల ఆందోళనలో కూడా అర్ధముంది కదా? కాబట్టి బ్యాంకుల ఆందోళన, ఒత్తిడి మేరకు నగదు విత్ డ్రా పరిమితిపై కేంద్రం మరికొంత కాలం ఆంక్షలు కొనసాగించే అవకాశాలు స్పష్టం.