నగదు కష్టాలు మళ్లీ వచ్చాయి

First Published Mar 11, 2017, 2:27 AM IST
Highlights

 మళ్లీ లేఖ రాస్తా నని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  బెదిరించినా రాష్ట్రానికి నగదు కొరత తిరిగొచ్చింది

ఆంధ్రప్రదేశ్ లో నగదు కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిజర్వు బ్యాంకుకు లేఖరాసినా,మరొక లేఖ రాస్తానని బెదిరంచినా,  నోట్లు బాంకుల నుంచి రావడంలేదు,ఎటిఎం లనుంచిరాలడంలేదు.

 

ఉత్తరాది రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయో లేదో ఇక్కడ నోట్ల కొరత మొదలయింది. రిజర్వుబ్యాంకు నుంచి అవసరమయిన నగదు రావడం లేదు. దీనితో కస్టమర్లు బ్యాంకులనుంచి,ఎటిఎం నుంచి  క్యాష్ తీసుకోకుండానే వెనుతిరగాల్సి వస్తున్నది. ఇప్పటికందుతున్న సమాచారం ప్రకారం ఒకటి రెండు జిల్లాలలో తప్ప రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఎటిఎంలు 40 నుంచి 90 శాతం వరకూ పనిచేయడం లేదు. నగదు లేక చాలా జిల్లాల్లో పెన్షన్ ల పంపిణీ కూడా నిలిచిపోయింది.

 

ఉదాహరణకు  శ్రీకాకుళం జిల్లాలో నగదు తారాస్థాయిలో ఉంది. జిల్లా రూ.50 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపితే, వారికి అందుతున్నది  రూ.30 కోట్లు మాత్రమే. ఆర్‌బిఐ నుంచి లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ వెంకటేశ్వరరావుకు అందిన సమాచారం.ఈ డబ్బులు ఎప్పుడు అందుతుందో  చెప్పలేకపోతున్నారు. జిల్లాలో పలు బ్యాంకుల పరిధిలో ఉన్న 290 ఎటిఎంలు శుక్రవారం సాయంత్రానికి ఖాళీ అయ్యాయి. జిల్లా కేంద్రంలోని 40 ఎటిఎంల్లో మధ్యాహ్నం 12 గంటల వరకూ నగదు లభ్యమైంది. ఆ తర్వాత ఎటిఎంల వద్ద నో క్యాష్‌ 
బోర్డులు దర్శనమిచ్చాయి.

 

ఏజెన్సీ ప్రాంతమైన సీతం పేటలో పది రోజులుగా ఎటిఎంల్లో నగదు లభించడం లేదని ప్రజలు వాపోతున్నారు. విజయనగరం జిల్లాలోని ఎటిఎంల్లో నో క్యాష్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. కొన్ని ఎటిఎంలో నగదు వేసినా కేవలం 15 నిమిషాల్లోనే ఖాళీ అవుతున్నాయి. జిల్లాలో 270 ఎటిఎం లు ఉంటే  80 శాతంలో నగదు ఉండడం లేదు.  డిమానేటైజేషన్ రోజుల నాటి అంక్ష  అంటే ఒక బ్యాంకులో అకౌంట్‌ ఉన్న ఖాతాదారునికి అకౌంట్‌ ఎక్కడుంటే అక్కడే నగదు తీసుకోవాలన్నది మళ్లీ అమలులోకి వచ్చింది.  ఇతర శాఖల్లో నగదు ఇచ్చేందుకు తిరస్కరిస్తున్నారు.

 

విశాఖలో సుమారు 284 ఎస్‌బిఐ ఎటిఎంలలో  ఇదే పరిస్థతి. మరొక సమస్య ఏమిటంటే ఏ ఎటిఎంలు పనిచేస్తున్నదో తెలియడం లేదు. ఒక వేళ ఏదైనా పుకారు వస్తే అక్కడికి ప్రజలు పరుగుతీస్తున్నారు. అక్కడ నిమిషంలో డబ్బులు ఖాళీ కావడమో లేక ఖాళీ ఎటిఎం వెక్కిరించడమో జరుగుతూ ఉంది.  తూర్పుగోదావరి జిల్లాలో 853 ఎటిఎంలకు గాను 760 పని చేయడం లేదని తెలిసింది. ఈ ఎటిఎంలలో మూడు రోజులుగా నో క్యాష్‌ బోర్డులే దర్శనమిస్తున్నాయి.

 

పశ్చిమగోదావరి జిల్లాలో 600 ఎటిఎంలు ఉండగా ప్రస్తుతం సగం ఎటిఎంలు కూడా పనిచేయడం లేదు. విజయవాడలో ఎటిఎంలు సగం మాత్రమే పనిచేస్తున్నాయి. ఎస్‌బిఐ మినహా మిగతా బ్యాంకుల్లో ఉపసంహరణలు రూ.10 వేలకు కుదించేశారు. నగరంలో 190 ఎటిఎంలు ఉండగా  శుక్రవారం 120 ఎటిఎంల్లో నగదు అందుబాటులో ఉంచినట్లు బ్యాంకు ఉన్నతాధికారులు చెబుతున్నారు. బ్యాంకులకు డిపాజిట్లు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో విత్‌డ్రావల్స్‌ మీద పరిమితి విధించాల్సి వస్తున్నదని  బ్యాంకు అధికారులు చెపుతున్నారు. కృష్ణాజిల్లాలో  పరిస్థతి కొంత మెరుగ్గా ఉంది. 40 శాతం ఎటిఎంలను పునరుద్దరించారు. బ్యాంకుల్లో నోక్యాష్‌ బోర్డులు ఎత్తివేసి రూ 50 వేల వరకు నగదు లావాదేవీలు నిర్వహించామని అధికారులు చెప్పారు.

 

 ప్రకాశం జిల్లాలో సుమారు  వందకోట్ల కరెన్సీ కొరత ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. నోట్ల కొరతతో సుమారు 40శాతం ఎటిఎంలు రోజూ మూసేసే కనిపిస్తున్నాయి. నో క్యాష్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. నోట్ల కొరత తీర్చేందుకు జిల్లాకు అవసరమైన మేరకు నగదు పంపాలని రిజర్వు బ్యాంకుకు ఇండెంట్‌ పంపినట్లు జిల్లా ఎల్‌డిఎం నరసింహారావు తెలిపారు. ఆదివారం నాటికి నోట్లు కొరత తగ్గొచ్చని ఆయన చెప్పారు.

 

కడప జిల్లాలో రూ.450 కోట్లు చలామణి అంటుంది. వచ్చింది రూ.105 కోట్లే వచ్చింది అందుబాటులో ఉన్నది రూ.30 కోట్లు మాత్రమే ఉంది. జిల్లాలో 372 ఎటిఎం లున్నాయి. గత నెల 28వ తేదీ నుంచేఇక్కడ నగదుకష్టాలు మొదలయ్యాయి. నగదు అందకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 90 శాతం ఎటిఎం కేంద్రాలు మూత పడినట్లు  తెలుస్తోంది. తిరుపతిలో పదిరోజులుగా ఎటిఎంలలో డబ్బులు లేవు. ఎటిఎంల వద్ద అవుటాఫ్‌ సర్వీస్‌ అని బోర్డులు ఏర్పాటు చేశారు.

 

యాత్రికుల రద్దీతో ఉండే తిరుపతి లో రైల్వేస్టేషన్‌, బస్టాండు వద్ద ఉన్న ఎటిఎంలలో డబ్బు లేదు.  దీనితో యాణికుల అవస్థ పడటంమొదలయింది. అనంతపురం జిల్లా  ఎటిఎంలున్నీ  నోక్యాష్‌ బోర్డుతో ముస్తాబయ్యాయి. దీనికి తోడు శని, ఆదివారం సెలవు.  పది రూపాయల నాణేం చెల్లదనే పుకారు జిల్లాలో బలంగా ఉంది.  దీనితో ప్రజలు వారి వద్ద దాచుకున్న చిల్లర నాణేలను బ్యాంకుల్లో జమ చేసేందుకు క్యూ కడుతున్నారు. కర్నూలు జిల్లాలో కూడా 90 శాతం ఎటిఎంలు బంద్‌ అయ్యాయి.

click me!