ఈ కుల తగాదా తీర్చడం బాబు తరమా

First Published Nov 23, 2016, 2:25 AM IST
Highlights

అనంతపురం మీద పట్టుకు కొట్లాడకుంటున్న కమ్మ కాపు తమ్ముళ్లు. బాబుకు తలనొప్పిగా తయారయిన  ’పచ్చ’ జిల్లా

అనంతపురం రగిలిన కులరచ్చ ( K vs K అనగా కాపు* వర్సెస్ కమ్మ )తీర్చడం బాబు తరమా? కష్టమే.

 

ఒక్క పరిటాల రవికాలంలో తప్ప,  అధికారంలో ఎవరున్నా ఈ జిల్లాలో రెడ్ల పెత్తనమే నడిచేది.  ఇపుడు కమ్మల్లో వచ్చిన కొత్త జనరేషన్ దీనిని సాగనీయకూడదని నిర్ణయించుకున్నట్లుంది.

.

కారణం వైఎస్ హయాంలో ప్రత్యర్థికులం గనుల,కాంట్రాక్టులతో ఎలావేళ్లూనుకుని పోయిందో చూశారు. అందుకే అమరావతిలో పచ్చ జండా ఎగురుతున్నపుడే అనంతపురంలో కూడా అదే జండా ఎగిరేయాలని నిశ్చయించుకున్నారు. జిల్లాలోపచ్చనేతలు, కొందరు పచ్చ అధికారులు కలసి  ఈ వ్యూహం లో భాగస్వాములయ్యారు.  దీని పర్యవసానమే  అనంతపురం మునిసిపాలిటీలో ఇపుడు  అంటుకున్న లోక్ సభ సభ్యుడు దివాకర్ రెడ్డి వర్సెస్ శాసన సభ్యుడు ప్రభాకర్ చౌదరి తగవు. 

 

సోమవారం నాడు నగరాభివృద్ధికి ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరితో పాటు అధికారులు అడ్డుపడుతున్నారంటూ దివాకర్ రెడ్డి ఆగ్రహ దీక్ష చేపట్టడం, దానిని పోలీసులు ’ఆరోగ్య‘ కారణలతో  విచ్ఛిన్నం చేశాక, ఈ తగవు ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గిరకు వెళ్లింది. కలెక్టర్‌ కోన శశిధర్, ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, మేయర్‌ స్వరూప, డిప్యూటీ మేయర్‌ గంపన్న, కమిషనర్‌ సోమనారాయణతో పాటు రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ అధికారులు సోమవారం రాత్రి  హుటాహుటిన రాజధాని చేరుకున్నారు.

 

అలిగిన దివాకర్ రెడ్డి మాత్రం అమరావతి వెళ్ల లేదని తెలిసింది. ముఖ్యమంత్రి ఇరువర్గాలకు బాగా చురకలంటించారట. ఇరువురిని సమర్థిస్తూనే , పనులుచేస్తున్న విధానం ఇదికాదని కసురుకునట్లు చెబుతున్నారు.  పరువు బజారు కీడ్చింది చాలు, నోరుమూసుకుని చెప్పింది చేయండని అన్నారట. ఎందకంటే, రాయలసీమలో టిడిపి అత్యధిక సీట్లు తెచ్చిన అనంతపురం 2014లో బాగా పచ్చబడంది.  అది 2019 లో చేజార రాదు.

 

 పార్టీలో క్రమశిక్షణ అంతా కట్టుబడాల్సిందే. అలా కాకుండా ఎవరికివారు మేమే లీడర్లమనేలా వ్యవహరిస్తే కుదరద ని ఘాటుగాహెచ్చరించారట.

 

అనంతపురం నగరాభివృద్ధిలో భాగంగా రోడ్డు విస్తరణ చేపట్టాల్సిందేనని దివాకర్ రెడ్డి ని వేనకేసుకొస్తూనే,  అయితే చేసే తీరు ఇది కాదని సీఎం ఆయన పద్ధతిని వ్యతిరేకించినట్లు తెలిసింది. ఎంపీ, ఎమ్మెల్యేలు ఇప్పటి వరకూ చేసిన రచ్చ చాలని, అభివృద్ధికి అడ్డు తగలడం  మానుకోవాలని చెప్పినట్లు చెబుతున్నారు.

 

 ఇది ఇలా ఉంటే, అనంతపురం పాతవూరు రోడ్డు విస్తరణ అంశాన్ని అధ్యయంన చేసి అసలు ఇందులో ఏముందో ,ఎందుకు వివాదాస్పదమవుతున్నదో చూడాలని  ముఖ్యమంత్రి ముగ్గురు సభ్యులతో (మునిసిపల్‌శాఖ మంత్రి నారాయణ, రవాణా శాఖ మంత్రి శిద్ధారాఘవరావు, ఎమ్మెల్సీ షరీఫ్‌) ఒక కమిటీ వేశారు. వీరితో పాటు పార్టీ తరఫున జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి కొల్లు రవీంద్ర కూడా కమిటీలో ఉంటారు.

 

 కమిటీ సభ్యులు గురువారం అనంతపురంల పర్యటిస్తారని తెలిసింది.   పాతూరులో అత్యధికంగా ఉన్న ఆర్యవైశ్యులతో పాటు ముస్లింలు, స్థానిక వ్యాపారులతో కమిటీ సమావేశమై వినతులు స్వీకరించి డిసెంబర నెలాఖరుకు నివేదికను కమిటీ ముఖ్యమంత్రికి సమర్పిస్తుంది.


   ( * రాయలసీమలో కాపు అంటే రెడ్డి కులం అని గమనించాలి. రెడ్డి అనేది కుల నామం కాదు,పూర్వపు ప్రొఫెషన్) 

 

click me!