బెంగళూరులో పబ్లిక్ బైస్కిల్ షేరింగ్ విధానం

First Published Sep 28, 2017, 12:42 PM IST
Highlights
  • ట్రాఫిక్ సమస్యకు స్వస్తి పలుకుతున్న కర్ణాటక ప్రభుత్వం
  • బెంగళూరులో పీబీఎస్ విధానం

ప్రస్తుతం ఎక్కడికి వెళ్లాలన్నా.. ప్రతి ఒక్కరూ బైక్, కారు, బస్ లాంటి వాహనాలనే ఉపయోగిస్తున్నారు.  కాస్త దూరం నడిచి వెళ్లినా చేరుకునే ప్రాంతానికి కూడా  ఈ వాహనాల మీదే ఆధారపడుతున్న రోజులివి. దీంతో ట్రాఫిక్  సమస్యతో పాటు కాలుష్య సమస్య కూడా పెరిగిపోయింది. చూద్దామనుకున్నా కూడా  ఈ రద్దీ రోడ్ల మీద సైకిళ్లు కనిపించడం లేదు. అక్కడక్కడ కొందరు పిల్లలు సైకిళ్లు నడపడం తప్ప.. పెద్ద వాళ్లు వాటి గురించి మర్చిపోయి చాలా రోజులౌతున్నాయి. అలాంటి సమయంలో.. ఇప్పుడు బెంగళూరు నగరంలో సైకిళ్లు విహారం చేయనున్నాయి.

పబ్లిక్ బైస్కిల్ షేరింగ్ ( పీబీఎస్) పేరిట బెంగళూరు నగర రోడ్లపై సైకిల్ తో ప్రయాణం చేయవచ్చు. ఇందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వమే అంగీకారం తెలిపింది. రూ.80కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఈ ఏడాది జూన్ నెలలో మొదటి సారిగా ఈ పబ్లిక్ బైస్కిల్ షేరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు బెంగళూరు నగరంలోనూ మొదలుపెట్టారు.

మొత్తం ఈ పీబీఎస్ ప్రాజెక్టులో 6వేల సైకిళ్లను ఏర్పాటు చేశారు. నగరవ్యాప్తంగా 350 సైకిల్ డాకింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. వాటి వద్ద ఈ సైకిళ్లను ఉంచుతారు. ఎవరికైనా సైకిల్ తొక్కాలి అనిపిస్తే.. ఆ డాకింగ్ స్టేషన్ వద్దకు వెళ్లి సైకిల్ తీసుకోవచ్చు. మొదటి గంట ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆ తర్వాత ప్రతి గంటకు రూ.5 చెల్లించాల్సి ఉంటుంది.  మీ అవసరం అయిపోయిన తర్వాత తిరిగి దగ్గరలోని డాకింగ్ స్టేషన్ లో ఇచ్చేయాలి. దీనివల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా కాలుష్యాన్ని కూడా నివారించవచ్చు.

డాకింగ్ స్టేషన్ల వద్ద తీసుకున్న సైకిల్ ని కొట్టేస్తే.. అనే ఆలోచన మీకు రావచ్చు. అలాంటివి జరగకుండా ఉండేందుకు సైకిల్ కి జీపీఎస్ సిస్టమ్ ని అమరుస్తున్నారు. దాని ద్వారా వారు సైకిల్ ని ట్రాక్ చేయగలుగుతారు.  బెంగళూరులోని ఎంజీ రోడ్డు, విధాన సౌధ, ఇందిరా నగర్, బనస్వాడి, హెచ్ ఆర్ బీ ఆర్ లే అవుట్, హెచ్ బీ ఆర్ లే అవుట్, కచరకనహలి, కోరమంగళ ప్రాంతాల్లో సైకిళ్లు నడుపుకోవచ్చని ఆ రాష్ట్ర మంత్రి టీబీ జయచంద్ర చెప్పారు.

10 నుంచి 15కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన సమయంలో ఈ సైకిళ్లను వినియోగించాలని  అర్బన్ డెవలప్ మెంట్ డిపార్టుమెంట్ అడిషనల్ ఛీఫ్ సెక్రటరీ మహేంద్ర జైన్ చెప్పారు. కాలుష్యాన్ని నివారించేందుకు ఈ విధానాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు.

click me!