బ్రాండ్ ఫ్యాక్టరీకి ఎంట్రీ ఫీజ్

First Published Nov 15, 2017, 5:17 PM IST
Highlights
  • ఈనెల 22 నుంచి 26వ తేదీ వరకు భారీ ఆఫర్లు ప్రకటించిన బ్రాండ్ ఫ్యాక్టరీ
  • షాప్ లో ఎంటర్ అవ్వాలంటే ఎంట్రీ ఫీజు కట్టాల్సిందే

ప్రముఖ రీటైల్ వ్యాపార సంస్థ బ్రాండ్ ఫ్యాక్టరీ అందరికీ తెలిసే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఏదో ఒక సమయంలో భారీ రాయితీలతో ఆఫర్లు కూడా ప్రకటిస్తూ కొనుగోలు దారులను ఆకట్టుకోవడంలో బ్రాండ్ ఫ్యాక్టరీ ముందంజలో ఉంటుంది. తక్కువ ధరలకే బ్రాండెడ్ దుస్తులను, వస్తువులను అందిస్తున్నఈ షాపులోకి వెళ్లాలంటే ఇక నుంచి ఎంట్రీ ఫీజ్ చెల్లించాలి. మీరు చదివింది నిజమే.. ఇప్పటి వరకు దేశంలో ఏ రిటైల్ వ్యాపార సంస్థ పెట్టని కండిషన్ ని వీరు అమలు చేస్తున్నారు.

అసలు విషయం ఏమిటంటే.. ఈ నెల 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు బ్రాండ్ ఫ్యాక్టరీలో భారీ తగ్గింపు ధరలతో ఆఫర్లు ప్రకటించారు. రూ.5000 విలువైన దుస్తులు లేదా వస్తువులను కొనుగోలు చేస్తే.. రూ.2వేలు చెల్లిస్తే సరిపోతుంది. వాటితోపాటు గిఫ్ట్ వోచర్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా ఇవ్వనుంది. అయితే.. ఆ ఐదు రోజుల్లో ఎప్పుడైనా షాప్ లోకి వెళ్లాలంటే ముందుగా రూ.100 నుంచి రూ.250 వరకు ఫీజ్ చెల్లించాలి. అలా చెల్లిస్తేనే లోపలికి అనుమతి ఇస్తారు. కాకపోతే.. షాపింగ్ చేసుకోవడం పూర్తయిన తర్వాత చెల్లించిన ఎంట్రీ ఫీజ్ ని మళ్లీ రిడీమ్ చేసుకోవచ్చు.

ఈ విషయంపై సంస్థ సీఈవో కిశోర్ బియానీ మాట్లాడుతూ... ఇలా ఎంట్రీ ఫీజ్ వసూలు చేయడం అనేది ప్రీ బుకింగ్ లాంటిదని చెప్పారు. అయినా తాము షాపింగ్ తర్వాత వినియోగదారులకు ఆ డబ్బులను తిరిగి ఇచ్చేస్తామని కూడా చెప్పారు. సీరియస్ కస్టమర్ల కోసమే ఈ కండిషన్ పెట్టినట్లు చెప్పారు. ఆఫర్లు ప్రకటించినప్పుడు..చాలా మంది కాలక్షేపం కోసం వస్తుంటారని  దీంతో షాప్ లో సిబ్బంది ఇబ్బంది పడాల్సి వస్తోందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అంటే.. ఆఫర్ల టైమ్ లో బ్రాండ్ ఫ్యాక్టరీలో విండో షాపింగ్ చేయడానికి కుదరదన్నమాట.

click me!