మైనర్ బాలుడి డ్రైవింగ్ కి ఓ నిండు ప్రాణం బలి(వీడియో)

First Published Feb 5, 2018, 12:29 PM IST
Highlights
  • బహదూర్ పురా లో దారుణం 
  • మైనర్ బాలుడి డ్రైవింగ్ చేస్తూ ప్రమాదానికి గురి
  • బైక్ వెనుక సీట్లో కూర్చున్న మరో బాలుడి మృతి

తల్లిదండ్రుల అతి గారాబం, పిల్లల అత్యుత్సాహం ఏదైతేనేం రోడ్లపై మైనర్లు వాహనాలేసుకుని అడ్డూ అదుపు లేకుండా తీరుగుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని నిబంధనలు పెట్టి కఠినంగా వ్యవహరించినా వీరి తీరు మారడం లేదు. ఇలా మైనర్లు రోడ్డుపైకి వచ్చి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన లేకుండా ప్రయాణిస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న సంఘటనలు నగరంలో అనేకం జరిగాయి. ఈ విధంగా స్కూటీ తీసుకుని రోడ్డుపైకి వచ్చి ప్రమాదానికి గురై తన స్నేహితుడి చావుకు కారణమయ్యాడో యువకుడు. ఈ సంఘటన హైదరాబాద్ బహదూర్ పురా ప్రాంతంలో జరిగింది.
 
నగరంలోని కిషన్‌బాగ్‌ అసద్‌బాబానగర్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ రియాజ్‌(12), అతడి బంధువు జునైద్‌ (15)తో కలసి ఆదివారం ఉదయం  బహదూర్‌పుర నుంచి అత్తాపూర్‌కు యాక్టివాపై బయలుదేరారు. జునైద్‌ వాహనాన్ని నడుపుతుండగా.. రియాజ్‌ వెనుక కూర్చున్నాడు.  అయితే  వేగంగా వెళుతున్న వీరు ఓ లారీ(ఏపీ 12వీ 9248)ని ఓవర్‌టేక్‌ చేసేందుకు ప్రయత్నిస్తూ ప్రమాదానికి గురయ్యాడు. కిషన్‌బాగ్‌ చౌరస్తాలో వేగంగా ముందుకు వెళ్లిన వీరు మెహక్‌ ఫంక్షన్‌ హాల్‌ వద్దకు  తమ వాహనాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పేందుకు ప్రయత్నించారు. దీంతో వెనుక కూర్చున్న రియాజ్‌  వాహనంపై నుంచి కింద పడ్డాడు. వెనుకు నుంచి వేగంగా వస్తున్న లారీ  రోడ్డుపై పడిన రియాజ్‌ తలపై నుంచి వెళ్లిపోయింది. దీంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు.  ఈ ఘటనలో వాహనం నడిపింది.. ప్రాణాలు కోల్పోయింది మైనర్లే.  

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  ప్రమాదానికి కారణమైన లారీని, యాక్టివాను స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

 

ప్రమాదం ఎలా జరిగిందో కింది సిసి టీవి వీడియోలో చూడండి

click me!