గంటాను అమరావతి పరిగెత్తించిన అయ్యన్న

First Published Jul 15, 2017, 3:34 PM IST
Highlights

మంత్రి గంటాకు చెమటలు పట్టిస్తున్న  మరొక మంత్రి అయ్యన్న పాత్రుడు

గంటా భూకుంభకోణంపై మరింత సాక్ష్యంతో సిట్ ముందుకు రానున్న అయ్యన్న

 ఈ సారి 190 కోట్ల ఇండియన్ బ్యాంక్ రుణం మీద సాక్ష్యం సేకరించిన అయ్యన్న

ఆంధ్ర మావన వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు శనివారం ఉన్నట్లుండి అమరావతి వెళ్లిపోవడం విశాఖలో చర్చనీయాంశమయింది. నిజానికి విశాఖలో ఆయన పాల్గొనాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నా అన్నింటిని వదులకుని ఆయన విజయవాడ విమానమెక్కారని  చెబుతున్నారు. చాలా కీలకమయిన విషయం మీద  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో మంతనాలాడేందుకే ఆయన రాజధాని పరుగుతీశాడని అంటున్నారు. లేదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే గంటాను ఉన్న ఫలానా రమ్మన్నారని కొందరంటున్నారు. ఈ రోజు ఆయన గుంటూరు జిల్లాలో ఎస్ ఆర్ ఎం విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవంలో కూడా పాల్గొనాల్సి ఉంది.

ఏమిటా ముఖ్య విషయం

రికార్డులు మార్చి, మాయం చేసి  భూములు కాజేయడానికి సంబంధించిన విశాఖ భూ కుంభకోణంలో కీలకమయిన సమాచారం తో జూలై 19వ తేదీన సిట్ ను కలుస్తానని మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రకటించడమే గంటా కంగారు పడుతున్నారట.

ఒక దఫా ఆయన సిట్ అధికారులను కలిశాడు. చెప్పాల్సిందంతా చెప్పాడు, చూపాల్సిన పత్రాలు చూపించాడు. మరక్కడ ఏం మాట్లాడారో ఏమో ఇపుడు  మరింత డాక్యుమెంటరీ సాక్ష్యాలతో  సిట్ ను 19వ తేదీను కలుస్తున్నానని ప్రకటించారు.

ప్రభుత్వ భూములను ఒక మంత్రి, ఆయన అనుయాయులు రోడ్లతో సహా కాజేశారని, వాటీమీద కోట్లరుణాలు పొందిన వ్యవహారాన్ని అయ్యన్న తవ్వుతున్నాడని గంటాఅనుమానం. ఇలాగే రెవిన్యూ రికార్డుల ట్యాంపరింగ్ లో గంటా ‘సోదరుడు’ పరుచూరి భాస్కరరావు ప్రమేయం ఉందనేది సర్వత్రా ఉన్న అనుమానం. వేములవలస పరిధిలో ప్రభుత్వభూమిని, రోడ్డును ఇండియన్ బ్యాంకుకు తాకట్టు పెట్టింది కూడా ఈ ‘సోదరుడే’. ఇండియన్ బ్యాంకు అధికారులు గంటా ఆస్తుల స్వాధీనంకోసం జారీ చేసిన నోటీసులో పేర్కొన్న భూముల వివరాలవల్ల ఈ ఫ్రాడ్ వెలుగులోకి వచ్చింది.  ఈ భూములను, రోడ్లను తాకట్టు పెట్టి రు.190కోట్ల రుణం పొందిన  వ్యవహారానికి సంబంధించి పూర్తి ఆధారాలతో జూలై 19న సిట్ అధికారి వినీత్ బ్రిజ్ లాల్ కు నివేదిక సమర్పిస్తానని అయ్యన్న పాత్రడు ప్రకటించారు. 

నిజంగా ప్రభుత్వ భూములను, రోడ్లతో సహా తాకట్టు పెట్టి రు. 190 కోట్ల రుణం తీసుకున్న విషయం ఆధారాలతో బయటకొస్తే గంటా పరిస్థితి ఎలా ఉంటుంది?  అపుడు కూడా ఆయన మంత్రిగా కొనసాగితే, చంద్రబాబు ఎలా సమర్థించుకుంటారు? అనే విషయాలమీద  రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ సాగుతూ ఉంది.

 

click me!