ఏషియానెట్-తెలుగు ఎక్స్ర్ ప్రెస్ న్యూస్

First Published Oct 5, 2017, 2:53 PM IST
Highlights

నేటి విశేషాలు

  • బాహుబలి సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ
  • అమిత్ షా కేరళ పర్యటన అర్ధాంతరంగా రద్దు
  •  తమిళనాడుకు విద్యాసాగరరావు వీడ్కోలు
  • సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడిగా అఖిలేష్
  • వైసిపిలో చేరిన యూత్ కాంగ్రెస్ నాయకుడు సుధాకర్ బాబు 
బాహుబలి చూపిస్తూ మెదడుకు ఆపరేషన్

ఆంధ్రప్రదేశ్  గుంటూరు పట్టణంలో వైద్యులు  బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ఓ మహిళకు వినూత్న పద్ధతిలో సర్జరీ చేశారు. టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి నిర్మించిన చిత్రం ‘బాహుబలి’ ని చూపిస్తూ ఒక ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన వినయ కుమారి అనే మహిళకు ఆపరేషన్ చేస్తున్న ప్రశాంతంగా ఉండేందుకు వారీ పద్ధతి ఎంచుకున్నారు.  అపరేషన్  సమయంలో ఆమె ఎలాంటి ఉద్వేగానికి లోనుకాకుండా, మేల్కోని ఉండేలా బాహుబలిని ప్రయోగించి విజయవంతమయ్యారు. ఈ సినిమా చూపిస్తూ రెండు గంటల వ్యవధిలో సక్సెస్ ఫుల్ గా వైద్యులు ఆపరేషన్ పూర్తి చేశారు.

 

సింగరేణిలో సా.4 గంటలకు 92.81 శాతం పోలింగ్


హైదరాబాద్ : సింగరేణి లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. సాయంత్రం 4 గంటల వరకు 92.81 శాతం పోలింగ్ నమోదైంది. ఇల్లందులో 97.03 శాతం, కొత్తగూడెం 95.07 శాతం, కార్పొరేట్ ఏరియాలో 94.51 శాతం పోలింగ్ నమోదు కాగా..మణుగూరులో 96.43 శాతం , శ్రీరాంపూర్ 92.99 శాతం , మందమర్రి-92.75 శాతం, బెల్లంపల్లి-95.41 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

 

కేరళ యాత్ర  నుంచి అర్థాంతరంగా ఢిల్లీ వెళ్లిన అమిత్ షా

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తన కేరళ యాత్ర మధ్యలోనే  ఆపేసి అకస్మికంగా ఢిల్లీ వెళ్లిపోవడం అందరిని కలవరపెడుతున్నది. ఆయన అక్కడ జరుగుతున్న ‘జన్ రక్షా యాత్ర’లో పాల్గొంటున్నారు.ఈ యాత్ర మంగళవారం కన్నూరులో ప్రారంభం అయింది. మరి  అంతలోనే షా తన పర్యటనను రద్దు చేసుకుని ఢిల్లీకి చెక్కేయడం వెనక కారణం ఏమయి ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది. షా పర్యటన రద్దు మీద బిజెపి ఇంకా ప్రకటన చేయలేదు.

 మాస్టర్ కార్డ్ సంస్థ తో ఏపీ ప్రభుత్వ ఒప్పందం

 

ఢిల్లీలో  సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకున్న ఏపీ ప్రభుత్వ ఐటీ సలహాదారు జె.ఏ.చౌదరి, మాస్టర్ కార్డ్ చైర్మన్ అజయ్ బంగా.

*విశాఖపట్నం లో సెంటర్ అఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న మాస్టర్ కార్డ్ 

*రైతులకు డిజిటల్ లావాదేవీలు సులభ తరం చేసేందుకు అవసరమైన చర్యలు

*సైబర్ సెక్యూరిటీ కోసం పలు కార్యక్రమాలు  మాస్టర్ కార్డ్ చేపడుతుంది

విశాఖపట్నం లో ఫిన్ టెక్ వ్యాలీ లో ప్రతి ఏటా వ్యాపార సదస్సు నిర్వహణలో పాలుపంచుకునేందుకు మాస్టర్ కార్డ్  ముందుకు వచ్చింది. విశాఖలో  ఫైనాన్షియల్ టెక్నాలజీ (ఫిన్ టెక్) తో అద్భుతాలు చేయవచ్చు నని ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘విశాఖపట్నంలో ప్రతి ఒక్కరిని ఫిన్టెక్ వాలీకి ఆహ్వానించాలని మేము కోరుతున్నాం. డిజిటల్ ఎకానమీ అవినీతి వంటి పలు సమస్యలను పరిష్కరిస్తుంది. భవిష్యత్ మొత్తం నాలెడ్జ్ ఆర్థికవ్యవస్థకు మాత్రమే ఉంటుంది,’ అని సిఎం అన్నారు. అనంతరం అజయ్ బంగ మాట్లాడుతూ టెక్నాలజీని అమలు చేయాలన్న  ముఖ్యమంత్రి ముందుచూపు రాష్ట్రాన్ని నూతన స్థాయికి తీసుకోవడంలో సహాయపడుతుందని అన్నారు. ప్రతి సంవత్సరం విశాఖపట్నంలో మాస్టర్ కార్డ్ వ్యాపార సమ్మేళనాన్ని నిర్వహిస్తుందని రాష్ట్రంలో సైబర్ భద్రత మరియు ఆర్థిక సాంకేతిక పరిజ్ఞానాల్లో పనిచేయడానికి మాస్టర్ కార్డ్ ముందు ఉంటుందని అన్నారు. 

తమిళనాడుకు విద్యాసాగరరావు వీడ్కోలు  

తమిళనాడు గవర్నర్ బాధ్యతల నుంచి సీహెచ్ విద్యాసాగరరావు వైదొలగతున్నారు. మహారాష్ట్ర గవర్నర్ అయిన విద్యాసాగరరావుకు అదనంగా తమిళనాడు గవర్నర్ బాధ్యతలను కూడా అప్పగించారు. కె రోశయ్య రిటైర్ అయినప్పటినుంచి(ఆగస్టు 2016) నుంచి ఆయన తమిళనాడు గవర్నర్ గా కూడా వ్యవహ రిస్తూ వచ్చారు. తమిళనాడుకు ఇప్పుడు బన్వారీలాల్ పురోహిత్ కొత్త గవర్నర్ గా నియమితులవడంతో విద్యాసాగరరావు ఆ బాధ్యతల నుంచి వైదొలగుతున్నారు.ఈ సందర్భంగా ఆయన తమిళనాడు ప్రజలకు, ముఖ్యమంత్రి పళినిస్వామికి కృతజ్ఞతలు చెప్పారు.తమిళనాడుకు గవర్నర్ గా వ్యవహరించడం తన భాగ్యమని, ఇక్కడి ప్రజలు ఎంతో స్నేహశీలురని ఆయన ప్రశంసించారు. గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావుకు తమిళనాడు ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలికింది. ముఖ్యమంత్రి కె. పళనిస్వామి ఆధ్వర్యంలో ఎయిర్‌పోర్టులో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం తదితరులు ఆయనను సన్మానించారు.

భారతదేశ సంపన్నులలో నెంబర్ వన్ ఎవరో తెలుసా?


ఫోర్బ్ ఇండియా 2017 ధనవంతుల జాబాతా ను గురువారం విడుదల చేసింది. ఈ జాబితా లో  రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ  ఆగ్రస్థానంలో ఉన్నారు. అంబానీ ఇలా టాప్ లో ఉండటం ఇది  వరుసగా పదో ఏడాది. సుమారు రూ. 2.5 లక్షల కోట్ల సంపదతో ముకేష్ మొదటి స్థానం దక్కించుకున్నారు. గతేడాది కంటే ముకేష్ సంపద ఈ సారి 15.3 బిలియన్ డాలర్లు(ఇండియన్ కరెన్సీలో సుమారు లక్ష కోట్లు) పెరిగింది. భారత దేశ  టాప్ 100 కుబేరుల సంపద ఈసారి 26శాతం పెరిగిన్నట్లు ఫోర్బ్ వెల్లడించింది. ముకేష్ తరువాతి స్థానంలో రూ. 1.25 లక్షల కోట్లతో విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ ఉన్నారు. 

సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడిగా అఖిలేష్

సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడిగా అఖిలేష్ యాదవ్ తిరిగి ఎన్నికయ్యారు. ఈ రోజు  జరుగుతున్న సమాజ్ వాదీ పార్టీ సర్వసభ్య సమావేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా వచ్చే ఐదేళ్ల కాలానికి అఖిలేష్ యాదవ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. 2019 లోక్ సభ ఎన్నికలు, 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికలలో అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోనే పార్టీ విజయం సాధిస్తుందన్న విశ్వాసాన్ని ఆ పార్టీ సీనియర్ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్ వ్యక్తం చేశారు.

వైసిపిలో చేరిన యూత్ కాంగ్రెస్ నాయకుడు సుధాకర్ బాబు 

ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెెస్ మాజీ అధ్యక్షుడు సుధాకర్ బాబు వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరారు. ఈ రోజు ఆయన గుంటూరులో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షలో పార్టీలో చేరారు. జగన్ పార్టీ కండువా కప్పి ఆయన వైసిపిలోకి ఆహ్వానించారు.

అళ్లగడ్డ వద్ద కారు ఢీకొని ఇద్దరు మృతి

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోగల నల్లగట్ల వద్ద ఈ రోజు కారు ప్రమాదం జరిగింది. అక్కడ రోడ్డును దాటుతున్న  ఓబులపతి (60) అనే వ్యక్తిని వేగంగా వస్తున్న కారు ఢీకొంది. ఢీకొన్న తర్వాత 50 కి.మీటర్ల మేర వ్యక్తితో పాటు ముళ్ల పొదల్లోకి కారు దూసుకెళ్లింది. ఆ వ్యక్తి  చనిపోవడంతోపాటు కారులో ప్రయాణిస్తున్న  మహిళ కూడా మృతి చెందింది. ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు.

శ్రీకాకుళం జిల్లాలో విషాదం

శ్రీకాకుళం జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. లావేరు మండలం గుర్రాలపాలెంలో బట్టలు ఉతికేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి ముగ్గురు మృతి చెందారు. మృతులను నాగమ్మ (45), దుర్గ (16), శిరీష (13)గా గుర్తించారు.

కెసిఆర్ మీద నాగం నారాజ్

తెలంగాణలో రైతులు ఎలా బతుతుకుతున్నరో అర్థం కావాలంటే  ముఖ్యమంత్రి కెసిఆర్ సీఎం పొలంబాట పట్టాలని బీజేపీ నాయకుడు నాగం జనార్ధన్‌ రెడ్డి సలహా ఇచ్చారు. ఆయన గురువారం నాడు విలేకరులతో మాట్లాడుతూ ఈ సలహా ఇచ్చారు. ‘ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. ఈ ఏడాది చాలా మంది రైతులు పత్తిసాగు చేశారు. కాయ పగిలే సమయంలో అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కాబట్టి వారికి తగిన పరిహారం ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్‌ భీమా పథకాన్ని రాష్ట్ర సర్కార్‌ నిర్లక్ష్యం చేస్తోంది,’అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బోల్తాపడి మంటల్లో కాలిపోయిన లారీ

తెలంగాణ నిజామాబాద్ జిల్లా మెండోర మండలం బుస్సాపూర్ లో ఈ రోజు ఒక లారీ బోల్తా పడింది. బోల్తా పడినప్పుడు లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో లారీ పూర్తిగా దగ్ధమైంది.  హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ కు వెళ్తుండగా 44 వ జాతీయ రహదారిపై లారీ టైర్ పగలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు, ఎన్ హెచ్ఎఐ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.

బిటెక్ విద్యార్థిని అదృశ్యం

 

 

మెదక్ జిల్లా నర్సాపూర్ బివిఆర్ ఐటి ఇంజినీరింగ్ కాలేజీలో బిటెక్ ప్రధమ సంవత్సరం చదువుతున్న లావణ్య అనే విద్యార్థిని అదృశ్యం కావడం సంచలనం సృష్టిస్తున్నది. కూతరు కనిపిచండం లేదని ఆమె తల్లిదండ్రులే పోలీసులకు  ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. లావణ్య హైదరాబాద్‌కు చెందిన యువతి .

 

 

 

 

 

 

click me!