పడవ ప్రమాద మృతుల కుటుంబీకులకు రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా

First Published Nov 13, 2017, 3:17 PM IST
Highlights
  • పడవ ప్రమాద ఘటన దురదృష్టకరమన్న చంద్రబాబు
  • మృతుల కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

కృష్ణానదిలో ఆదివారం జరిగిన పడవ ప్రమాద సంఘటన అత్యంత దురదృష్టకరమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆదివారం కృష్ణా నదిలో పడవ మునిగిన సంగతి తెలిసిందే ఈ ఘటనలో 20మంది మృత్యువాతపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను చంద్రబాబు సభలో వివరించారు. పడవలో 41 మంది ప్రయాణించారన్నారు. ఇప్పటి వరకు 20 మంది మృదేహాలు వెలికితీశామని, నలుగురికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని స్పష్టం చేశారు. మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది.. వారికోసం గాలింపు చర్యలు చేపట్టామని సీఎం స్పష్టం చేశారు. కాగా ఇద్దరు బోటు సిబ్బంది ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు. ప్రాణాలతో బయటపడిన వారు క్షేమంగా ఇళ్లకు చేరినట్లు వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయని సీఎం తెలిపారు.

పడవ ఆపరేటర్ నిర్లక్షమే ప్రమాదానికి కారణమన్నారు. అతను నిబంధలను పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.టూరిజం డిపార్ట్మెంట్‌ అధికారులు చెప్పినా వినకుండా బోటు నడిపారని, భయంతో అందరూ ఒకవైపుకు ఒరగడం వల్ల ప్రమాదం జరిగిందన్నారు. బోటుకు అనుమతి లేదని, డ్రైవర్‌కు అనుభవం లేదని చంద్రబాబు చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్ధికసాయాన్ని చంద్రబాబు ప్రకటించారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌తో కమిటీ వేస్తామని స్పష్టం చేశారు. మత్స్యకారులు పిచ్చయ్య, శివయ్య 14 మందిని కాపాడారని.. వాళ్లను అభినందిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ప్రమాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన అసెంబ్లీ..మృతులకు సంతాపం ప్రకటిస్తూ సభ్యులు రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.

click me!