
రెండు రోజులు సెలవులు వచ్చాయి.. ఎక్కడికి వెళ్లాలి అని అనుకుంటున్నారా.. అండమాన్ వెళ్లి వచ్చేయండి. ఎందుకంటే.. ఇప్పుడు అండమాన్ వెళ్లిరావడం చాలా సులువు. అది కూడా రెండున్నర గంటల్లో గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు.
విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిరిండియా రెండేళ్లుగా పోర్టుబ్లెయిర్(అండమాన్)కు విమాన సర్వీసులు వారానికి రెండు మార్లు అందిస్తోంది. ఈ సర్వీసులకు డిమాండ్ పెరగడంతో ఆ సంస్థ ఇంకో రెండు సర్వీసులు పెంచుతోంది. ఢిల్లీ మీదుగా కనెక్టివిటీ పెంచింది.
కేవలం ఢిల్లీ నుంచే నెలకు 30వేల మంది అండమాన్ వెళ్తున్నారట. ప్రయాణికుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని వచ్చే ఏడాది జనవరి నుంచి విమాన సర్వీసులను పెంచాలని భావిస్తున్నారు. ప్రయాణ సమయం తక్కువగా ఉండటం, ప్రముఖ పర్యాటక ప్రాంతం కావడంతో ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం.
ఢిల్లీ-విశాఖ-పోర్టు బ్లెయిర్-ఢిల్లీ విమాన సర్వీసు..
ఢిల్లీ –విశాఖ–పోర్టుబ్లెయిర్ –ఢిల్లీకి సోమ, గురు, శనివారాల్లో సర్వీసులు అందించడానికి ప్రణాళిక చేసింది. ఆ రకంగా ఢిల్లీలో ఉదయం 5.30కి బయలుదేరి విశాఖకు 7.40కి చేరుతుంది. ఇక్కడి నుంచి ఉదయం 8.15కి బయలుదేరి 10.10కి పోర్టుబ్లెయిర్ చేరుతుంది. పోర్టుబ్లెయిర్‌లో 10.50కి బయలుదేరి ఢిల్లీకి మధ్యాహ్నం 2.35కి వెళ్తుంది.
ఢిల్లీ- పోర్టుబ్లెయిర్- విశాఖ- ఢిల్లీకి విమాన సర్వీసు..
ఎయిరిండియా విమాన సంస్థ ఢిల్లీ–పోర్టుబ్లెయిర్–విశాఖ–ఢిల్లీకి మంగళ, బుధ, శుక్ర,ఆదివారాల్లో సర్వీసులు అందించనుంది. ఢిల్లీలో ఉదయం 5.30కి బయలుదేరి పోర్టుబ్లెయిర్‌కు 9.15కు చేరుతుంది. అక్కడి నుంచి 9.55కి బయలుదేరి విశాఖకు 11.55కి వస్తుంది. ఇక్కడి నుంచి మధ్యాహ్నం 12.30కి బయలుదేరి 2.35కి ఢిల్లీ చేరుతుంది.