ఇది పక్కా లోకల్.. లోకల్...

First Published Jul 22, 2017, 1:23 PM IST
Highlights

ప్రపంచ యుద్ధం సైనికుల దాహం తీర్చిన కూల్ డ్రింక్

పెప్సీలు, కోక్ లెన్ని వచ్చినా నిలబడిన ఆంధ్రా లోకల్ డ్రింక్

సెంచురీ చేరు కుంటున్న పక్కా లోకల్

 

గ్లోబలైజేషన్ సునామీ ఎంత తోసుకువచ్చినా  అక్కడక్కడా ‘లోకల్’ నిటారుగా నిలబడే ఉంటుంది.  మనకు నిత్య జీవితంలో ఎన్నో నిఖార్సయిన లోకల్స్ బ్రాండ్స్ మనమెవరో మన సత్తాఏమిటో నిరూపిస్తూనే ఉంటాయి. ఇలాంటి పక్కా లోకల్ బ్రాండ్ ఆర్టోస్. ఆర్టోస్ పేరు వింటే, ఇదేదో ఫారిన్ సరుకు అనుకుంటారు. కాదు, ఇది పక్కా లోకల్. అర్టోస్ అనేది ఆంద్రావాళ్ల కూల్ డ్రింక్.  కోస్తాంధ్రలో రెండు మూడు జిల్లాలకే పరిమితమయిన ఈ డ్రింక్  ఇతర జిల్లాల వారికి పెద్దగా తెలియదు. అయితే, దీనిని గొప్పతనం ఇపుడు తెలుసుకోవాలి. ఎందుకంటే, పెప్సీలు, కోక్ లు వచ్చి దేశీ బాండ్లన్నింటిని కభళించినా, అర్టోస్ ను ఏమీ చేయలేకపోయాయి. ఈ రెండు మూడు జిల్లాలలో అర్టోస్ అభిమానులు పార్టీ ఫిరాయించలేదు. దాదాపు వందేళ్లుగా నిటారుగా నిలబడిన చరిత్ర ఉన్న  ఈ ఆర్టోస్ గురించి ఒక ఫేస్ బుక్ పోస్టులో వచ్చిన అద్భుతమయిన కథనమిది...

 

అవి 1912లో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తున్న రోజులు... తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురానికి చాలామంది బ్రిటీష్ సైన్యం వస్తున్నారు. అలసిపోయిన సైన్యానికి గోలిసోడాలు అమ్మేవారు అక్కడ ఉండే అడ్డూరి రామచంద్ర రాజు గారు. వారు సైన్యంతో మంచి స్నేహ సంబంధాలు కొనసాగించేవారు. ఆ బంధంతో ఇంగ్లాండ్ నుండి కూల్ డ్రింక్స్ తయారు చేసే మిషిన్స్ ను దిగుమతి చేసుకున్నారు. మొదట 1919లో ఏ.ఆర్.రాజు అనే పేరుతో డ్రింక్స్ అమ్మారు. ఆ తర్వాత 1955లో “ఆర్టోస్” గా పేరు మార్చారు. అప్పట్లో దీనినే ‘రాజు గారి కలర్ కాయ్’ అని ప్రజలు ముద్దుగా పిలుచుకునే వారు. అప్పటి వరకు నిమ్మరసం, గోలిసోడాలు తాగుతున్న వారికి ఈ డ్రింక్ టేస్ట్ కొత్తగా అనిపించింది, ఇంకా గోదావరి జిల్లాలో ఉండే కొబ్బరి బొండాలు, గోదావరమ్మ నీళ్ళ లాగే ఈ Artos లోని రుచి నచ్చడంతో మంచి సక్సెస్ అయ్యింది. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ సక్సెస్ పరంపర అలా కొనసాగుతూనే ఉంది.

ఆర్టోస్ ను అమ్మేది లేదు...

ఆర్టోస్(1955) తర్వాత మనదేశంలో చాలా రకాల కూల్ డ్రింక్స్ వచ్చేశాయి. వాటిలో చాలా వాటిని ‘కోక్’ కంపెనీ కొనేసింది. కోక్ కంపెని మన ఆర్టోస్ కంపెనీని కూడా కొనేసి బ్రాండ్ నేమ్, టేస్ట్ మార్చెద్దామని అనుకుంది కాని రామచంద్ర రాజు గారు దానికి ఎంత మాత్రం ఒప్పుకోలేదు. ఆ తర్వాత పోటీ ఎక్కువైనా గాని మిగిలిన వాటి కన్నా తక్కువ ధరకే కేవలం 5రూపాయల కన్నా తక్కువ ధరకే అమ్మేవారు. అలా తక్కువ ధరకే అమ్ముతూ ఇప్పటికి మిగిలిన కూల్ డ్రింక్స్ పోటీని బలంగా ఎదుర్కుంటు ముందుకు సాగుతున్నారు.

ఏ కూల్ డ్రింక్ టేస్ట్ దానికదే ప్రత్యేకంగా ఉంటుంది ఆర్టోస్ టేస్ట్ కూడా అలా ప్రత్యేకంగానే ఉంటుంది. కాని ఇది మన తెలుగు వారి సంస్థ కావడంతో Artosపై మన వారికి అభిమానం మరింత పెరిగింది. ప్రస్తుతం ఇది కేవలం తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నంలో మాత్రమే దొరుకుతుంది ఐనా కూడా మంచి బిజినెస్ జరుగుతూ కోట్లల్లో టర్నోవర్ సాధిస్తుంది. మీరెప్పుడైనా ఆ వైపు వెళ్తే టేస్ట్ చూసేయండి మరి.

click me!