ఆయన్ని  అమెరికా 600సార్లు చంపాలనుకుంది.అయినా ఏమీ కాలేదు

First Published Oct 16, 2017, 1:06 PM IST
Highlights
  • క్యూబాని 49సంవత్సరాలు పాలించిన క్యాస్ట్రో
  • అగ్రదేశం అమెరికాను గడగడలాండించిన వీరుడు క్యాస్ట్రో
  • అమెరికా కబంధ హస్తాల నుంచి క్యూబాని రక్షించిన వీరుడు క్యాస్ట్రో

ఫిడెల్ క్యాస్ట్రో.. ఈ పేరు వింటేనే అమెరికా సామ్రాజ్య వాదుల గుండెల్లో గుబులు పుడుతుంది. ఈ పేరు వింటే కమ్యూనిస్టుల వొళ్లు పులకరిస్తుంది. క్యూబా లాంటి చిన్న దేశం అగ్రదేశమైన అమెరికాని గడగడలాడించిందంటే అది కేవలం క్యాస్ట్రో సాహసమే. కేవలం క్యూబా దేశానికే కాకుండా  యావత్ ప్రపంచానికి స్ఫూర్తి ఫిడెల్ క్యాస్ట్రో. అలాంటి వీరుడు మృత్యువాత పడి దాదాపు సంవత్సరం కావస్తోంది. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు..

క్యాస్ట్రో.. క్యూబాలోని మయారి పట్టణానికి సమీపంలోని ఉన్న బిరాన్ గ్రామంలో జన్మించారు.. క్యాస్ట్రో తండ్రి స్పెయిన్ దేశం నుంచి వలస వచ్చిన చెరకు తోటల పెంపకం దారుడు. చిన్నతనంనుంచి క్యాస్ట్రో చురుగ్గాఉండేవారు.. ఉద్యమాల్లో పాల్గొనేవారు.. 1947లో క్యూబన్ పీపుల్స్ పార్టీలోచేరిన ఫిడేల్‌ ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు.. 1950లో హవానా విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తూనే 1952లో క్యూబా ప్రతినిథుల సభ కోసం జరగబోయే ఎన్నికల్లో పోటీచేశారు. అయితే అదే సమయంలో బాటిస్టా.... మిలిటరీ కుట్ర ద్వారా అధికారాన్ని చేజిక్కించుకుని క్యూబాలో నియంతృత్వాన్ని నెలకొల్పాడు. కాస్ట్రో.... బాటిస్టా నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక రహస్య విప్లవ వర్గానికి నాయకత్వం వహించారు.

జూలై 26, 1953 న క్యాస్ట్రో దళాలు క్యూబాలోని మోన్‌కాడా సైనిక స్థావరాన్ని ముట్టడించాయి. ఈ ముట్టడిలో పట్టుబడిన క్యాస్ట్రోకు 15ఏళ్ల జైలుశిక్ష విధించారు.. 1955లో  జైలు నుంచి విడుదలైన క్యాస్ట్రో ఉద్యమం అనే పేరుతో విప్లవ దళాన్ని నిర్మించారు... ఈ విప్లవ దళంతో కాస్ట్రో మెక్సికో వెళ్లారు... అక్కడే విప్లవ కారుడు చెగువీరా వీరితో కలిసారు. మొత్తం 82 మందితో కూడిన ఈ విప్లవ దళం 1956 డిసెంబరులో క్యూబాలో కాలు పెట్టింది.. ఈ దళంలోని 70 మంది పోరాటంలో అమరులయ్యారు.. కాస్ట్రో, అతని సోదరుడు రౌల్ కాస్ట్రో, చెగువీరా మరో 12 మంది క్యూబా ఆగ్నేయ ప్రాంతంలోని సియెర్రా మేస్త్రా పర్వత శ్రేణిలోకి పారిపోయారు. అక్కడి ప్రజలను విప్లవదళంలోకి చేర్చుకున్నారు.. దళాన్ని అనూహ్యంగా పెంచుకున్న క్యాస్ట్రో 1958 డిసెంబరులో హవానాకు బయలుదేరాడు. ప్రజలనుంచి క్యాస్ట్రోకు లభించిన ఆదరణ చూసిన బాటిస్టా జనవరి 1, 1959 న దేశం విడిచి పారిపోయాడు.. ఆ తర్వాత క్యూబా నాయకుడిగా క్యాస్ట్రో అధికారాన్ని చేపట్టారు.

అలా అధికారాన్ని చేపట్టిన క్యాస్ట్రో 49 సంవత్సరాల పాటు క్యూబాని పరిపాలించారు. ప్రపంచంలోనే అగ్రదేశంగా ఎదిగిన అమెరికాని తమ దేశం జోలికి రాకుండా గడగడలాడించాడు. దీంతో క్యాస్ట్రోని తట్టుకోలేక అమెరికా ఆయనను 600 సార్లు చంపడానికి ప్రయత్నించి విఫలమైంది. ఆయనకు ఇష్టమయిన సిగార్ లను పేల్చేసే ప్రయత్నం చేసింది. ఆహారంలో విషయం కలిపి చంపే ప్రయత్నం చేసింది. ప్రాణాపాయ పంగస్ ను ఆయన ఈత దుస్తులకు పట్టించి చర్మవ్యాధులు సోకేలా ప్రయత్నించింది. ఏయే అధ్యక్షుడు ఆయనను చంపాలనుకున్నారో చూడండి. ఐసెన్ హోవెర్ 38 ప్రయత్నాలు చేయించాడు. ఇక ఇతర అధ్యక్షులకు సంబంధించి,కెన్నడీ 42 సార్లు, జాన్సన్ 72, నిక్సల్ 184, కార్టర్ 64, రీగన్ 197, సీనియర్ బుష్ 16, క్లింటన్ 21 సార్లు  (మొత్తం 638 సార్లు )ఆయన  మీద హత్యాయత్నం చేయించారని సిఐఎ రికార్డులే వెల్లడిస్తున్నాయి. చివరి ప్రయత్నం 2000 లో పనామాలో జరిగింది. ఆయన ఉపన్యసించాల్సిన వేదిక మీది కుర్చీకింద భారీగా పేలుడు పదార్ధాలు పేర్చారు. అయితే అదీ వీగిపోయింది.

మొదట్లో క్యూబా అమెరికా సామ్రాజ్యవాదుల కబంద హస్తాల్లో ఉండేది. వారి నుంచి విడిపించి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత క్యాస్ట్రోది. కొన్ని సంవత్సరాల పాటు అమెరికా.. క్యూబాకి ఆర్థిక ఆంక్షలు విధించినా.. ఎదురొడ్డి నిలపడేలా చేశాడు క్యాస్ట్రో. అంతేకాకుండా ప్రజల్లో దేశభక్తిని పెంపొందించాడు. దేశ ఖనిజ సంపద అమెరికా దోచుకోకుండా కాపాడి ఆ సంపదను దేశ ప్రయోజనాలకు ఉపయోగించుకునేలా చేశాడు. ఈ విఫలయత్నాల సమాచారమంతా బ్రిటిష్ డాక్యమెంటరీ ‘638 Ways to Kill Castro’ రికార్డు చేసింది.

ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలచిన క్యాస్ట్రో.. అనారోగ్య సమస్యలతో  బాధపడుతూ 2016 నవంబర్ లో 90 వ యేట సహజమరణం పొందారు.  ఆయన్ని చంపాలనుకున్న అగ్రరాజ్యం అమెరికా ఓడిపోయింది.

 

click me!