
వీళ్లంతా ఇండియా తరఫున ఐస్ హాకీ కి ప్రాతినిథ్యం వహిస్తున్నవారు. అదేంటీ భారత్ లో ఐస్ యే ఉండదు ఇంకా ఐస్ హాకీ ఏంటీ అని ఆశ్చర్యపోకండి. మన దేశంలో ఐస్ హాకీ ఆడుతున్నారు. కొందరు అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందిన క్రీడాకారులున్నారు. ఐస్ హాకీ అసోసియేషన్ కూడా దేశంలో పనిచేస్తోంది.
దేశానికి పెట్టనికోటలా ఉండే హిమాలయాల్లోని లోయల్లో ఐస్ హాకీకి మంచి ప్రాచుర్యం ఉంది. స్థానికంగా ఉండే మహిళలు కూడా ఈ ఆటలో రాణిస్తున్నారు.
మన దేశంలో ఆట అంటే కేవలం క్రికెట్ ఒక్కటే అనే భ్రమలో ఉండేవారికి ఇది పెద్దగా తెలిసిఉండదు లేండి.
లే, గుపక్స్ తదితర హిమాలయ లోయల్లో మహిళలు ఐస్ హాకీని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇటీవల చైనాలో నిర్వహించిన ఐఐహెచ్ఎఫ్ ఛాలెంజ్ కప్ ఆఫ్ ఆసియా టోర్నీలో కూడా ఈ టీం పాల్గొంది. అక్కడ ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోయినా మలేషియా లాంటి మేటీ టీంను ఓడించినంత పని చేసింది.
మన దృష్టిలో ఇదంతా గొప్ప విషయం కాకపోవచ్చు. కానీ, ఎవరి ప్రోత్సాహం లేకుండా, రిన్క్ ( ఐస్ హాకీ మైదానం) కూడా సరిగా లేకుండా, సరైన శిక్షణ కూడా లేకుండా దేశంలో వెలుగులో లేని క్రీడలో అంతర్జాతీయ స్థాయిలో ఓ మహిళా జట్టు ఈ స్థాయికి రావడం విశేషమే కదా..
కేవలం ఐస్ హాకీ పట్ల ఉన్న అభిమానామే వారిని ఈ స్థాయికి తీసుకొచ్చింది. కాస్త తోడ్పాటు, ఆర్థికసాయం అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో వారంతా దేశం గర్వించే విజయాలు సాధిస్తారనడంలో ఏలాంటి సందేహం లేదు.
కానీ, ఐపీఎల్ లో విదేశీ ఆటగాళ్ల కోసం కోట్లు ఖర్చు పెట్టిన మనవాళ్లు వీరికి కనీసం పైసా అయినా విదిలించడం లేదు.
ఇండియా తరఫున ఆడకపోయినా బెన్ స్టోక్ కు అక్షరాల రూ. 14 .8 కోట్లు ఇస్తున్న మనవాళ్లు... అదే ఇండియా తరఫున ఆడుతున్న ఈ అమ్మాయిలకు కనీసం హాకీ స్టిక్ లు కూడా కొనివ్వలేక పోతున్నారు.