ఈ రామాలయంలో.. ఆంజనేయుని విగ్రహం ఎందుకు లేదు..?

First Published Mar 5, 2018, 12:49 PM IST
Highlights
  • ఆంజనేయుడు నిత్యం శ్రీరాముడిని స్మరిస్తూ ఉంటాడు కాబట్టి.. ప్రతి రామాలయంలో కచ్చితంగా ఆంజనేయుని విగ్రహం ఏర్పాటు చేస్తుంటారు. అయితే.. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక రామాలయంలో మాత్రం.. హనుమంతుడు లేడు.

శ్రీరామునికి .. ఆంజనేయుడు పరమ భక్తుడు. ఆంజనేయుడు లేకుండా.. సీతారాముల ఫోటో కనిపించడం చాలా అరుదు. ఆంజనేయుడు నిత్యం శ్రీరాముడిని స్మరిస్తూ ఉంటాడు కాబట్టి.. ప్రతి రామాలయంలో కచ్చితంగా ఆంజనేయుని విగ్రహం ఏర్పాటు చేస్తుంటారు. అయితే.. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక రామాలయంలో మాత్రం.. హనుమంతుడు లేడు. ఆయన లేకుండానే.. సీతారాములు కొలువుదీరారు. ఆ ఆలయం మరెక్కడో లేదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలోని ఒంటిమిట్టలో ఉంది. మరి ఈ ఆలయం వెనుక ఉన్న అసలు కథేంటో ఒకసారి తెలుసుకుందామా..

రామాలయం అనగానే..మనకు ముందుగా గుర్తుకు వచ్చేది భద్రాచలం. ఆ తర్వాత అంతస్థాయిలో గుర్తింపు పొందింది ఒంటిమిట్ట రామాలయమే. ఒక్కడ రాముడు.. సీతా లక్ష్మణ సమేతంగా కొలువుదీరారు. సీతారాములను ఒకే శిలలో కొలువున్నారు కాబట్టి..  ఈ ప్రాంతాన్ని ఏకశిలా నగరం అని కూడా పిలుస్తారు.

ఆలయ స్థల పురాణం..

రామ లక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకువెళ్లిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది. అయితే..   సీతారామ కల్యాణం జరిగాక కూడా  శ్రీరాముడు యాగరక్షణకు వెళ్లారు. మృకండు మహర్షి, శృంగి మహర్షి కోరిక మేరకు శ్రీరాముడు..సీతాదేవి, లక్ష్మణుడితో కలిసి  ఒంటిమిట్ట  ప్రాంతానికి వచ్చారు. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఒకే శిలలో చెక్కించగా..ఆ తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేశారని ఇక్కడ ప్రజల విశ్వాసం.

సీతాదేవిని.. రావణాసురుడు అపహరించిన తర్వాత.. ఆంజనేయుడు రాముడిని చేరతాడు. హనుమంతుడు రామునిడి చేరక ముందే.. ఒంటిమిట్టలో ఆలయాన్ని నిర్మించారు కాబట్టి.. ఇక్కడ ఆంజనేయుని విగ్రహం ఉండదు. దేశంలోని మిగిలిన అన్ని రామాలయాల్లో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది.

చంద్రుని వెలుగులో ఉత్సవాలు..

ఈ ఆలయంలో మరో ప్రత్యకత కూడా ఉంది. కేవలం చంద్రుని వెలుగులో మాత్రమే స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుపుతుంటారు. ఇందుకు కూడా ప్రత్యేకమైన కారణం ఉంది. పురాణ కథల ప్రకారం.. క్షీరసాగర మథనం తరువాత మహాలక్ష్మీదేవి అమ్మవారిని నారాయణుడు తన సతీమణిగా స్వీకరించాడు. పగలు జరిగే స్వామివారి వివాహాన్ని తాను చూడలేకపోతున్నానని మహాలక్ష్మీ దేవి సోదరుడైన చంద్రుడు స్వామివారికి విన్నవించాడట. దీంతో స్వామివారు.. ఒంటిమిట్టలో వెన్నెల వెలుగుల్లో తన కల్యాణాన్ని వీక్షించవచ్చని వరమిచ్చాడు. దాని ప్రకారమే రాత్రిళ్లు ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ప్రతి యేటా శ్రీరామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. శ్రీరామనవమికి ఏపీ ప్రభుత్వం .. స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు, తలంబ్రాలు తీసుకువస్తుంటారు.
 

click me!