జనసేన జాతకం బాగ లేనట్లుంది...

First Published Mar 5, 2018, 12:20 PM IST
Highlights

నాయకులందరిని మంచోళ్లంటూ భుజానెత్తుకుంటే, జనసేన అవసరమేమిటి?

 పవన్ కల్యాణ్ రాజకీయ జాతకం బాగుండటం లేదు. సాధారణంగా కొత్త పార్టీ పెట్టేవాళ్లు పవర్ లోకి రావాలనుకుంటున్నారు. వాళ్ల అన్న చిరంజీవి ఆ మధ్య ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు, ఎందుకు? పవర్ లోకి వస్తామనే కదా. అదే విధంగా కెసిఆర్ తెలంగాణ రాష్ట్రసమతి పెట్టింది, తెలంగాణ తెచ్చుకుని పవర్ లోకి రావాలనే కదా. ఏక్కడయిన పార్టీ  పెట్టి ఎన్నికల్లో పోటీ చేసి నానా యాగి చేసేది  దండిగా సీట్లు తెచ్చకుని పవర్ లోకి వస్తామనే. అయితే, పవన్ జనసేన పార్టీ పెట్టినప్పటినుంచి పవర్ కు దూరమవుతున్నాడు. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా బిజెపి, టిడిపిల తరఫున ప్రచారం చేశాడు. ఆ 2019 నాటికి ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసే స్థితికి వచ్చి, ఇపుడు న్న పార్టీలు, టిడిపి, వైసిసి, బిజెపి, టిఆర్ ఎస్ లకు వ్యతిరేకంగా ఒక పెద్ద ఫోర్స్ గా తయారవుతాడని అనుకుంటే... అసలు ఆ రూట్లో ఆయన పోవడమే లేదు. మొదట్లో ప్రశ్నిస్తాఅని ఒక ఉరుము ఉరిమాడు. ఆ తర్వాత ప్రశ్నించడం మానేసి ప్రశంసించడం  మొదలుపెట్టాడు. మొదట ప్రధానిని ప్రశంసించాడు. తర్వాత అనుభవజ్ఞుడు, పాలనా దక్షుడుఅని ఆంధ్ర ముఖ్య మంత్రిని ప్రశసించాడు. తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను తెగ మెచ్చుకున్నాడు. ఇపుడుకెసిఆర్ ప్రతిపాదిస్తున్న మూడో ఫ్రంటును మెచ్చుకున్నాడు. ఇలా మెచ్చకుంటూ పోతే, నీ మార్గమేమిటి? అన్యాయం అవినీతి లేని ప్రభుత్వాన్ని అందిస్తానన్న  నీ కోరిక నెరవేరేదెపుడు? నువ్వు ప్రశ్నించేందుకు ఏం మిగులుతుంది?

నిజానికి కేంద్రం కత్తి దూసింది మొదట పవనే. ఆయన దక్షిణాది, ఉత్తరాది అంటూ మంచి పల్లవి ఎత్తుకున్నాడు. దక్షిణాది మీద చిన్నచూపు సహించం అన్నాడు. దక్షిణాది రాష్ట్రాల మీద కేంద్రం పెత్తనం కుదరదు  అన్నాడు. అవసరమయితే విడిపోవాల్సి వస్తుందన్నాడు. అపుడు కెసిఆర్  జనసేన ప్రతిపాదనను పట్టించుకోనే లేదు. అపుడు  కెసిఆర్ కు కేంద్రంతో కయ్యం  అవసరం లేకుండా పోయింది. అందుకే కెసిఆర్  పవన్ ను తృణీ కార భావంతో చూశారు. ఇపుడు పవన్ స్లోగన్ నే కొంచెం మార్చి కెసిఆర్ ఇస్తున్నారు. అయితే,భారీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ‘ దేశ్ కి నేత కెసిఆర్ ’  అదిరిపోయేలా తయారుచేశారు.

మొత్తానికి స్వతంత్ర పార్టీగా జనసేన పెరిగిపెద్దదయ్యే అవకాశం కనిపించడం లేదనిపిస్తుంది. ఆయన  అన్ని పార్టీలను , తన కంటే అనుభవజ్ఞులను పొగుడుతూ పోతుంటారేమో.... అందుకే జనసేన జాతకం మారుతుందన్న నమ్మకం కల్గడం లేదు.

click me!