ఇసుక తుఫాను, భారీ వర్షాల బీభత్సం: 97 మంది మృతి

First Published May 3, 2018, 4:02 PM IST
Highlights

ఇసుక తుఫాను, భారీ వర్షాల తాకిడికి రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 97 మంది మరణించారు. 

న్యూఢిల్లీ: ఇసుక తుఫాను, భారీ వర్షాల తాకిడికి రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 97 మంది మరణించారు. బుధవారంనాడు ఈ రెండు రాష్ట్రాలను భారీ వర్షాలు, ఇసుక తుఫాను కుదిపేశాయి. 

ఉత్తర ప్రదేశ్ లో తీవ్రమైన ఇసుక తుఫానుకు 64 మంది మరణించగా, 160 మంది గాయపడ్డారని సహాయ కమిషనర్ సంజయ్ కుమార్ చెప్పారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలోనే 43 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు .

ఇళ్లు కూలిపోయాయి. బిజ్నౌర్, సహరాన్ పూర్, బరేలీ ప్రాంతాల్లో మిగతా మరణాలు సంభచించాయి. సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ అధికారులను ఆదేశించారు. అలసత్వం ప్రదర్శించకూడదని హెచ్చరించారు. 

రాజస్థాన్ లో తుఫాను బీభత్సం సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా గత రాత్రి శక్తివంతమైన ఇసుక తుఫాను సంభవించింది. ఈ ఘటనలో 33 మంది మరణించారు. వంద మందికి పైగా గాయపడ్డారు. 

తూర్పు రాజస్థాన్ లోని ఆల్వార్, ధోల్పూర్, భరత్ పూర్ ప్రాంతాల్లో దాని తాకిడి తీవ్రంగా ఉంది. దాంతో విద్యుత్ కనెక్షలు తెగిపోయాయి. చెట్లు నేలకూలాయి. ఇళ్లు కూలిపోయాయి. మృతుల సంఖ్య పెరుగుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఆల్వార్ లో గత రాత్రి నుంచి చిమ్మచీకటి అలుముకుంది. చెట్లు కూలిపోయి విద్యుత్ స్తంభాలు తెగిపోవడంతో కరెంట్ సరఫరా ఆగిపోయింది. భరత్ పూర్ లో నష్టం ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతంలోనే 11 మంది మరణించినట్లు తెలుస్తోంది.

బాధితులకు వెంటనే సహాయం అందేలా చూడాలని ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా అధికారులను ఆదేశించారు. మృతుల కుటంబాలకు సానుభూతిని తెలియజేశారు. 

సంఘటనపై మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెసు నేత అశోక్ గెహ్లాట్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన జన్మదిన వేడుకలను రద్దు చేసుకున్నారు. బుధవారం సాయంత్రం ఇసుక తుఫాను, భారీ వర్షం ఢిల్లీని కూడా తాకింది. రెండు అంతర్జాతీయ విమానాలతో పాటు 15 విమానాలను దారి మళ్లించారు. 

రాజస్థాన్ లోని చాలా ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం వేడి గాలులు వీచాయి. కోటలో 45.4 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇసుక తుఫాను, వేడి గాలులు వచ్చే అవకాశం ఉందని వాతావరణ పరిశోధనా కార్యాలయం తెలియజేసింది.

click me!