
భారత దేశంలో ఎపుడూ ఏ కులంలో,మతంలో ఇలా జరిగి ఉండదేమో.
జార్ఖండ్ లోని పాలము ప్రాంతంలో ఇపుడు జరిగింది.
కట్నాలకోసం కోసం ఇంకా భారత దేశంలో కోడళ్లును హింసిస్తున్న ఈ రోజుల్లో... ఎపుడో జరిగిన పెళ్లికి తీసుకున్న కట్నాన్నంతా ఆ వూరి వాళ్లు వాపసు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా 800 ముస్లింకుటుంబాలు తాము తీసుకున్న కట్నం వాపసు ఇచ్చి పాపం కడిగేసుకున్నాయి.
గత ఎప్రిల్ 24 న ఇక్కడ కట్న వ్యతిరేక ఉద్యమం మొదలయింది. పోఖరి అనే గ్రామంలో సంఘ సేవకుడు హజీ ముంతాజ్ అలీ అనే వ్యక్తి మొదట వరకట్న దురాచారం గురించి నోరు విప్పాడు.
చిన్న కలకలం మొదలయింది. ఆయన మాట్లాడటం మానలేదు. కలకలం పెద్ద దయింది. ఒక ఏడాది తర్జన భర్జన తర్వాత ఇది కొంతమందిని ఆలోచింపచేసింది. ముంతాజ్ అలీ చుట్టూ ఒక గుంపు తయారయింది, అంతా జై అన్నారు. ఆయన నినాదం ఉద్యమం అయింది. దీనితో స్థానిక మౌళ్వీలు కూడా మద్దతు పలికారు. అంతేకాదు, కట్నం ప్రస్తావన ఉన్న పెళ్లికి దీవెన లిచ్చేది లేదు పొమ్మన్నారు.
దీని ఫలితమే 800 కుటుంబాలు సేకరించిన కట్నాన్నంతా పెళ్లికూతుళ్ల తల్లితండ్రులకు వాపసు ఇచ్చాయి. దీని విలువ రు 6 కోట్ల దాకా ఉంటుందట.
“ ఇంతవరకు ఈ వరకట్నమనేది మాకుటుంబాలను క్యాన్సర్ లా తినేసింది. ఇపుడు దాన్ని తరిమేశాం. అయితే, మా ప్రాంతంలో ఇంకా కొంతమంది ఈ దూరాచారం పాటిస్తూనే ఉన్నారు. తొందర్లోనే ఈ కుటుంబాలు కూడా దారికొస్తాయి,” అని అలీ చెప్పాడు.
‘ నేను కట్నం తీసుకుని చాలా పెద్ద తప్పుచేశానని ఇపుడనిపిస్తూ ఉంది. ఈ విషయం ప్రకటించేందుకు నేను గర్వపడుతున్నాను. ప్రాయశ్చిత్తంగా నేను కట్నం వాపసు ఇస్తున్నాను. భవిష్యత్తులో మాకుటుంబానికి కట్నం డిమాండ్ చేసే పరిస్థితిరానీయను,’ అని గ్రామస్తుడు సలీం అన్సారీ చెప్పారు.